- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లయిన వ్యక్తి సహజీవనం చేయడం నేరం కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు
వివాహితుడైన వ్యక్తి మరొక మహిళతో సహజీవనం చేయడం నేరం కాదని.. నైతికత, చట్టం వేర్వేరు అని స్పష్టం చేస్తూ అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరిచింది.

దిశ, వెబ్‌డెస్క్: అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) సంచలన తీర్పును వెలువరించింది. ఒక వివాహితుడు మేజర్ అయిన మహిళతో ఆమె సమ్మతితో కలిసి ఉండటం నేరం కిందకు రాదని కోర్టు స్పష్టం చేసింది. ఒక జంట తమకు రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సదరు పురుషుడికి ఇప్పటికే వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. అయితే, అతడు మరొక యువతితో గత 18 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. దీంతో సదరు యువతి కుటుంబ సభ్యులు, ఆ పురుషుడు తమ కూతురిని కిడ్నాప్ చేసి పెళ్లికి బలవంతం చేస్తున్నాడంటూ కేసు పెట్టారు. తమకు తమ కుటుంబం నుంచి ప్రాణహాని ఉందని, ‘పరువు హత్య’ (Honor Killing) జరిగే అవకాశం ఉందని ఆ జంట కోర్టును ఆశ్రయించింది.
పౌరుల హక్కులను కాలరాయలేం కదా..
అయితే, మేజర్లు (Major's) అయిన ఇద్దరు వ్యక్తులు పరస్పర సమ్మతితో కలిసి ఉండటం ఏ చట్టం ప్రకారం కూడా శిక్షార్హమైన నేరం కాదని పేర్కొంది. నైతికత, చట్టాన్ని విడివిడిగానే చూడాలని ధర్మాసనం తెలిపింది. సామాజిక అభిప్రాయాలు, నైతిక విలువల ఆధారంగా కోర్టులు పౌరుల హక్కులను కాలరాయలేవని జస్టిస్ జె.జె. మునీర్ (Justice J.J. Muneer), జస్టిస్ తరుణ్ సక్సేనా (Justice Tarun Saxena)ల ధర్మాసనం పేర్కొంది. చట్టం ప్రకారం, ఓ వివాహితుడు వేరే మహిళతో కలిసి ఉండటాన్ని ప్రశ్నించే హక్కు కేవలం అతడి భార్యకు మాత్రమే ఉంటుందని కామెంట్ చేశారు. ఇతర కుటుంబ సభ్యులకు, బయటి వ్యక్తులకు ఆ హక్కు లేదని కోర్టు స్పష్టం చేసింది. కలిసి ఉండాలనుకునే ఇద్దరు వయోజనులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదేనని ధర్మాసనం గుర్తు చేసింది. షాజహాన్‌పూర్ ఎస్పీని ఈ విషయంలో వ్యక్తిగత బాధ్యత వహించాలని ఆదేశిస్తూ.. ఆ జంటను అరెస్ట్ చేయకూడదని మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది.






