అమిత్ షా కాదు.. 'అపవాదుల షా': సీఎం స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్

by Malleboina Mahesh |

ఇటీవల తమిళనాడులో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ఆరోపణలపై సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అమిత్ షా కాదు.. అపవాదుల షా: సీఎం స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల తమిళనాడులో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ఆరోపణలపై సీఎం ఎంకే స్టాలిన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఈ రోజు ఓ సమావేశంలో పాల్గొన్న స్టాలిన్ మాట్లాడుతూ.. షా చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆయనను 'అమిత్ షా' అని పిలవాలా.. 'అపవాదుల షా' (Defamation Shah) అని పిలవాలా అని సందేహం కలుగుతోందని ఎద్దేవా చేశారు. తమిళనాడులో హిందూ మత విశ్వాసాలకు, పూజా కార్యక్రమాలకు ప్రభుత్వం అడ్డుపడుతోందన్న షా వ్యాఖ్యలను స్టాలిన్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులపై అమిత్ షాకు కనీస అవగాహన లేదని మండిపడ్డారు.

4 వేల ఆలయాలకు కుంభాభిషేకాలు - 7 వేల కోట్లు రికవరీ

డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 4,000 దేవాలయాలకు కుంభాభిషేకాలు (Kudamuzhukku) నిర్వహించామని స్టాలిన్ గణాంకాలతో సహా వివరించారు. అలాగే, ఆక్రమణల నుంచి 997 ఆలయాలకు చెందిన 7,655 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ సుమారు రూ. 7,701 కోట్లు ఉంటుందని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇంత భారీ స్థాయిలో ఆలయ అభివృద్ధి పనులు జరిగాయా అని సీఎం స్టాలిన్ సూటిగా ప్రశ్నించారు. సచివాలయంలో వారానికి కనీసం రెండు రోజులు తాను హిందూ ధార్మిక శాఖ పనులను సమీక్షిస్తానని గుర్తుచేశారు.

భక్తులు మెచ్చే 'ద్రావిడ మోడల్'

నిజమైన భక్తులు, ఆధ్యాత్మిక వేత్తలు తమ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నారని స్టాలిన్ పేర్కొన్నారు. తమ 'ద్రావిడ మోడల్' పాలన అన్ని మతాల విశ్వాసాలను గౌరవిస్తుందని, ప్రజల హక్కులను కాపాడుతుందని స్పష్టం చేశారు. తమ పాలనలో హిందూ ధార్మిక శాఖ సాధించిన విజయాల గురించి చెప్పాలంటే రోజంతా సమయం సరిపోదని, భక్తులకు మేలు చేసే ప్రభుత్వం తమదేనని ఆయన తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే మరికొద్ది రోజుల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జాతీయ, స్థానిక పార్టీల మధ్య మాటల యుద్దం తీవ్రతరం అయింది. ఈ క్రమంలో అమిత్ షా చేసిన పర్యటన ఈ ఎన్నికలపై అందరి దృష్టి పడేలా చేసింది.

Next Story