సీఎం హిమంత బిశ్వ శర్మ భార్యకు 3 దేశాల పాస్‌పోర్టులు : కాంగ్రెస్ సంచలన ఆరోపణలు

by Ramesh Naini |

అస్సాం రాజకీయాల్లో కొత్త వివాదం చెలరేగింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రినికి శర్మ లక్ష్యంగా కాంగ్రెస్ నేత పవన్ ఖేరా చేసిన ఆరోపణలు, దానికి సీఎం ఇచ్చిన ఘాటు కౌంటర్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

సీఎం హిమంత బిశ్వ శర్మ భార్యకు 3 దేశాల పాస్‌పోర్టులు : కాంగ్రెస్ సంచలన ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అస్సాం రాజకీయాల్లో కొత్త వివాదం చెలరేగింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్య రినికి శర్మ లక్ష్యంగా కాంగ్రెస్ నేత పవన్ ఖేరా చేసిన ఆరోపణలు, దానికి సీఎం ఇచ్చిన ఘాటు కౌంటర్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. సీఎం భార్య రినికి శర్మకు యూఏఈ, ఈజిప్ట్, ఆంటిగ్వా దేశాల పాస్‌పోర్టులతో పాటు దుబాయ్, అమెరికాలో భారీగా అక్రమ ఆస్తులు ఉన్నాయని పవన్ ఖేరా ఆరోపించారు. భారత్‌లో ద్వంద్వ పౌరసత్వానికి అనుమతి లేనప్పుడు ఇదెలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల అఫిడవిట్‌లో ఈ విదేశీ ఆస్తుల వివరాలను సీఎం ఎందుకు దాచారని నిలదీశారు. వెంటనే సీఎం హిమంతను అరెస్ట్ చేసి, కేంద్ర హోంమంత్రి జోక్యంతో సిట్ (SIT) విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

సీఎం కౌంటర్...

ఈ ఆరోపణలను అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తీవ్రంగా ఖండించారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ ఈ నిరాధారమైన, తప్పుడు ప్రచారానికి తెరతీసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ చూపించిన డాక్యుమెంట్లన్నీ మార్ఫింగ్ చేసిన నకిలీ పత్రాలని, వాటిలో పేర్లు, ఫొటోలు, తేదీల్లో ఎన్నో తప్పులు ఉన్నాయని సీఎం ఎక్స్ (X) వేదికగా వివరించారు. పవన్ ఖేరాపై 48 గంటల్లో క్రిమినల్, సివిల్ పరువు నష్టం దావా వేస్తామని.. అసత్యాలు ప్రచారం చేసినందుకు ఆయన జైలుకు వెళ్లడం ఖాయమని హెచ్చరించారు.

Next Story