టెంపుల్ గోల్డ్ హోల్డింగ్స్ మానిటైజేషన్‌పై కేంద్రం వివరణ

by Malleboina Mahesh |

దేవాలయాల బంగారు నిల్వలను నగదీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోందంటూ వస్తున్న వార్తలను పీఐబీ పూర్తిగా ఖండించింది. ఇవన్నీ పుకార్లేనని స్పష్టం చేసింది.

టెంపుల్ గోల్డ్ హోల్డింగ్స్ మానిటైజేషన్‌పై కేంద్రం వివరణ
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో దేవాలయాల బంగారు నిల్వల (Gold reserves)పై సాగుతున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) కీలక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఆలయ ట్రస్టులు, మతపరమైన సంస్థల వద్ద ఉన్న బంగారాన్ని నగదీకరించేందుకు (Monetisation), దానికి బదులుగా గోల్డ్ బాండ్లను జారీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందంటూ వస్తున్న వార్తలను పీఐబీ తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ కేవలం నిరాధారమైన పుకార్లు మాత్రమేనని PIB తేల్చిచెప్పింది.

గత కొద్ది రోజులుగా దేశంలోని దేవాలయాల బంగారు నిల్వలను ద్రవ్యీకరించే ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం (Central Govt) ఆమోదం తెలిపిందని, ఆలయాల బంగారం ఆధారంగా కొత్త బాండ్లను జారీ చేయనుందని కొన్ని మీడియా సంస్థలలో, సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ ఊహాగానాలు, పుకార్లలో ఎలాంటి నిజం లేదని, ఇవి పూర్తిగా తప్పుదోవ పట్టించేవిగా (Misleading) ఉన్నాయని పీఐబీ ఢిల్లీ విభాగం స్పష్టం చేసింది. వ్యూహాత్మక నిల్వల వాదన నిరాధారం: దేవాలయాల గోపురాలు, తలుపులు లేదా ఇతర నిర్మాణాలకు ఉపయోగించిన బంగారు పూతలను/ప్లేట్లను భారత్ తన "వ్యూహాత్మక బంగారు నిల్వలు" (Strategic Gold Reserves of India) గా పరిగణించ బోతోందంటూ వస్తున్న వార్తలు కూడా పూర్తిగా బేస్ లెస్ (ఆధారం లేనివి) అని కేంద్రం స్పష్టం చేసింది.

అలాగే ఇలాంటి ధృవీకరించని సమాచారాన్ని సామాజిక మాధ్యమాలలో షేర్ చేయడం వల్ల ప్రజల్లో అనవసరమైన గందరగోళం ఏర్పడుతుందని, కాబట్టి పౌరులు ఎవరూ వీటిని నమ్మవద్దని, ఫార్వర్డ్ చేయవద్దని ప్రభుత్వం కోరింది. అధికారిక ప్రెస్ రిలీజ్ లు, ప్రభుత్వ వెబ్‌సైట్లు, ధృవీకరించబడిన పబ్లిక్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వం సూచించింది.

Next Story