- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మీడియేషన్.. న్యాయవ్యవస్థ ఉత్తమ రూపం: సీజేఐ సూర్యకాంత్
మీడియేషన్ అనేది న్యాయవ్యవస్థ ఉత్తమ రూపం అని సీజేఐ సూర్యకాంత్ అన్నారు. అన్ని సమస్యలకు కోర్టుల్లో పరిష్కారం దక్కాలన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: కోర్టులు కేవలం కేసుల విచారణ కోసమే కాకుండా.. మల్టీ డోర్ వ్యవస్థలుగా మారాలనేదే తన కల అని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ అన్నారు. ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం అందించే కేంద్రాలుగా కోర్టులు మారాలని ఆయన ఆశించారు. దక్షిణ గోవా వేదికగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన తొలి నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ సింపోసియం ఆన్ మీడియేషన్‌లో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి గోవా సీఎం ప్రమోద్ సావంత్, సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, బాంబే హైకోర్టు సీజే ఎస్ చంద్రశేఖర్, భారత బార్ కౌన్సిల్ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా, గోవా అడ్వొకేట్ జనరల్ దేవీదాస్ పాంగ్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా తన ఆలోచనలు పంచుకున్న ఆయన.. జిల్లా స్థాయి నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రతిచోటా భారీ సంఖ్యలో మీడియేటర్ల అవసరం ఉందన్నారు. మీడియేషన్ (మధ్యవర్తిత్వం) వల్ల న్యాయవ్యవస్థపై భారం తగ్గుతుందని, అయితే దీన్ని చట్టం బలహీనతలా కాకుండా అత్యుత్తమ పరిణామంగా చూడాలని సీజేఐ చెప్పారు. ‘కోర్టులు కేవలం ట్రయల్స్‌కు వేదికలుగా కాకుండా.. సమస్యల పరిష్కారానికి కేంద్రాలుగా మారే గొప్ప దృశ్యాన్ని నేను చూడాలనుకుంటున్నా’ అని ఆయన అన్నారు.
సమస్యతో వచ్చి.. పరిష్కారంతో వెళ్లాలి..
న్యాయం కోసం ఎవరైనా కోర్టు తలుపులు తట్టినప్పుడు.. వారికి మీడియేషన్, ఆర్బిట్రేషన్, చివరకు లిటిగేషన్ అన్ని రకాలుగా సహకారం లభించాలని, సదరు వ్యక్తి సమస్యకు ఏది సరిపోతే ఆ సేవలు అందుబాటులో ఉండాలని సీజేఐ సూర్యకాంత్ వివరించారు. ‘కొన్ని కేసుల్లో మధ్యవర్తిత్వం, ఆర్బిట్రేషన్ ద్వారా పరిష్కారం దొరకదని మనం గుర్తించాలి. అలాంటి సందర్భాల్లో న్యాయబద్ధమైన లిటిగేషన్ విచారణలు జరిపి, తీర్పులిచ్చేందుకు జ్యుడీషియల్ వ్యవస్థ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది’ అని తెలియజేశారు. ఈ మల్టీ డోర్ వ్యవస్థ లిటిగెంట్లకు అత్యుత్తమమైన హక్కులు కలిగిస్తుందన్నారు. ‘లిటిగేషన్ అనేది ఒక ముగిసిన బంధానికి పోస్టుమార్టం చేయడం. తప్పు ఎక్కడ జరిగిందని పరిశీలించడం. కానీ మధ్యవర్తిత్వం అలాకాదు. అది ఆ బంధాన్ని కొనసాగించడానికి అవసరమయ్యే సర్జరీ చేయడం వంటిది. ఈ ప్రక్రియను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే.. దీన్ని స్థానిక జ్ఞానంలా చూడాలి’ అని వివరించారు.
2.5 లక్షల మంది అవసరం
మధ్యవర్తిత్వం విజయవంతం కావాలంటే.. మధ్యవర్తి స్థానిక భాష మాట్లాడాలని, కేవలం భాషే కాకుండా అక్కడి యాస, భావాలు, సంప్రదాయాలు అన్నీ తెలిసుండాలని చెప్పారు. ఇప్పటి వరకు 39 వేల మంది శిక్షణ పొందిన మీడియేటర్లు ఉన్నప్పటికీ.. డిమాండ్, సప్లయ్ మధ్య భారీ తేడా ఉందన్నారు. అన్ని స్థాయిల్లో మధ్యవర్తిత్వాన్ని అమలు చేసేందుకు ఈ దేశంలో 2.5 లక్షల కన్నా ఎక్కువ మంది మధ్యవర్తుల అవసరం ఉందని సీజేఐ వెల్లడించారు. ప్రజలకు మీడియేటర్లుగా శిక్షణ ఇచ్చే సమయంలో జాగ్రత్తగా ఉండాలని.. ఎందుకంటే మధ్యవర్తిత్వం కేవలం ఒక ఆర్ట్ కాదు. సదరు వ్యక్తి సానుభూతి, ప్యాషన్, కమిట్‌మెంట్, నిబద్ధత, ప్రవర్తన అన్నీ సరిగా ఉంటేనే ఆ కథ సుఖాంతం అవుతుందని జస్టిస్ సూర్యకాంత్ స్పష్టంచేశారు.
ఈ విధానాలతో కోర్టులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ‘మీడియేషన్ ఫర్ నేషన్’ క్యాంపెయిన్‌ను జులై నెలలో లాంచ్ చేసినట్లు ఆయన గుర్తుచేశారు. వివాహాలు, వ్యాపారాలు, మోటార్ యాక్సిడెంట్లు వంటి కేసులను మధ్యవర్తిత్వంతో పరిష్కరించే లక్ష్యంతో తెచ్చిన ఈ క్యాంపెయిన్ ఫలితాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. ఇదే జోరుతో అన్ని స్థాయుల్లో శిక్షణ పొందిన మీడియేటర్లను ఉంచితే.. దేశ సక్సెస్ స్టోరీ ఇంతకంటే గొప్పగా ఉంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు.






