- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Chirag Paswan: బిహార్ ఎన్నికల్లో చిరాగ్ సత్తా.. జనసేనతో పోల్చుతున్న నెటిజన్లు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి డబుల్ సెంచరీ చేసింది. 205 స్థానాల్లో లీడింగ్ దిశగా దూసుకెళ్తున్న కూటమిలో అభ్యర్థుల్లో ఇప్పటికే పలువురి విజయం ఖాయమైంది.

దిశ, వెబ్‌డెస్క్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి డబుల్ సెంచరీ చేసింది. 205 స్థానాల్లో లీడింగ్ దిశగా దూసుకెళ్తున్న కూటమిలో అభ్యర్థుల్లో ఇప్పటికే పలువురి విజయం ఖాయమైంది. ఈ ఎన్నికలు ఎన్డీయే కూటమి పట్టం కట్టడమే కాకుండా.. యువనేత రాజకీయ ఆవిర్భావానికి వేదికయ్యాయి. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ బిహార్ రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ కు తగ్గ తనయుడని నిరూపించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమితో జతకట్టిన లోక్ జనశక్తి పార్టీ.. 29 స్థానాల్లో పోటీకి దిగగా.. 21 స్థానాల్లో ఆధిక్యంలోకి వచ్చారు. 72 శాతం స్ట్రైక్ రేటుతో విజయాన్ని నమోదు చేయనున్నారు. గతేడాది లోక్ సభ ఎన్నికల్లోనూ ఐదు స్థానాల్లో పోటీ చేయగా.. 5 స్థానాల్లోనూ విజయం సాధించారు. ఈ ఏడాది కూడా ఆయన విజయం పార్టీ అభ్యర్థులు విజయం దిశగా దూసుకెళ్తుండటంతో.. పార్టీ పలుకుబడి పెరిగింది.
2020 అసెంబ్లీ ఎన్నికల సమయంలో .. జేడీయూతో విబేధాల కారణంగా ఒంటరిగా పోటీకి దిగారు చిరాగ్. 137 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి.. ఒకే ఒక్క స్థానంలో గెలిచి ఘోర అవమానాల పాలయ్యారు. రామ్ విలాస్ పాశ్వాన్ వారసత్వాన్ని ముందుకు నడిపించే సత్తా ఆయనకు లేదని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆ తర్వాత 2021లో సొంత బాబాయ్ పశుపతి కుమార్ పారస్ పార్టీని చీల్చి.. రామ్ విలాస్ పాశ్వాన్ వారసత్వం కోసం పోటీ పడటంతో పరిస్థితి మరింత దిగజారింది. దెబ్బ మీద దెబ్బ పడినా కుంగిపోకుండా.. తనదైన వాక్చాతుర్యంతో పుంజుకున్నారు. దళిత సమస్యలపై పోరాడి.. 2024 లోక్ సభ ఎన్నికల్లో 100 శాతం విజయం సాధించారు. ఇప్పుడు 72 శాతం స్ట్రైక్ రేటుతో దూసుకెళ్తున్నారు.
గతేడాది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనూ జనసేన పార్టీ ఇదే మాదిరిగా బీజేపీ, టీడీపీలతో జతకట్టి 21 స్థానాల్లో పోటీచేసి వందశాతం గెలుపును సొంతం చేసుకుంది. చిరాగ్ పాశ్వాన్ పార్టీ LJP కూడా జనసేన మాదిరిగానే రాజకీయాల్లో పుంజుకుంటోందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.






