బంగ్లాదేశ్‌లో పెళ్లి వద్దు! ప్రజలకు చైనా ఎంబసీ వార్నింగ్

by Phanindra |   (  Updated:2025-05-26 15:18:39  IST  )

బంగ్లాదేశ్‌లో పెళ్లిళ్లు వద్దని ప్రజలకు చైనా ఎంబసీ వార్నింగ్ ఇచ్చింది. ఇలా చేస్తే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించింది.

బంగ్లాదేశ్‌లో పెళ్లి వద్దు! ప్రజలకు చైనా ఎంబసీ వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్ యువతులతో అక్రమ వివాహాలు వద్దని ప్రజలకు చైనా హెచ్చరికలు జారీ చేసింది. అక్రమ పెళ్లిళ్ల బ్రోకర్లు, భార్యలను కొనుగోలు చేయడం వంటి ప్రయత్నాలు మానుకోవాలని బంగ్లాదేశ్‌లోని చైనీస్ ఎంబసీ సూచించింది. రొమాన్స్ స్కా్మ్స్ ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఎంబసీ హెచ్చరించింది. బంగ్లాదేశీయులతో చైనీయులు చట్టవ్యతిరేకమైన సంబంధాలు పెట్టుకుంటున్నారని, అక్రమ వివాహాల సంఖ్య పెరుగుతోందని రిపోర్టులు వచ్చిన నేపథ్యంలోనే ఈ వార్నింగ్ వచ్చినట్లు సమాచారం. విదేశీయులతో పెళ్లిళ్ల విషయంలో చట్టాన్ని కచ్చితంగా అనుసరించాలని, పెళ్లిళ్ల బ్రోకర్ల ముసుగులో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికి దూరంగా ఉండాలని ఎంబసీ సూచించింది.

‘భార్యను కొనాలనే ఆలోచనను ప్రజలు వదులుకోవాలి. బంగ్లాదేశ్‌లో పెళ్లిళ్లు చేసుకునే ముందు వందసార్లు ఆలోచించుకోవాలి’ అని ఎంబసీ స్పష్టం చేసింది. చాలామంది టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా బంగ్లాదేశ్ అమ్మాయిలను మోసం చేసి, వారిని వ్యభిచారం, అక్రమ వివాహాల్లోకి దింపుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి అమ్మాయిలను పెళ్లి చేసుకొని అక్రమంగా చైనా తీసుకొస్తే కఠిన శిక్షలు తప్పవని చైనా ఎంబసీ స్పష్టం చేసింది. అలాగే ఇలా మానవ అక్రమ రవాణా చేసినా, ప్రయత్నించినా, దీనికి సహకరించినా బంగ్లాదేశ్‌లో కూడా కఠినమైన శిక్షలు పడతాయని హెచ్చరించింది.

కాగా, చైనాలో చాలా కఠినంగా ‘ఒకే బిడ్డ’ సూత్రాన్ని అమలు చేస్తారు. దానికితోడు ఎక్కువ మంది అబ్బాయిలే కావాలని అనుకోవడంతో ఆడపిల్లలను పుట్టగానే చంపేస్తారని కూడా అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో చైనాలో తీవ్రంగా ఆడపిల్లల కొరత ఉంది. దీంతో సుమారు 3 కోట్ల మంది చైనా మగవాళ్లు భార్యలు లేకుండా మిగిలిపోతున్నారని గణాంకాలు చెప్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొంత డబ్బిస్తే బంగ్లాదేశ్‌లో అందమైన అమ్మాయిలతో వివాహం చేపిస్తామని అనడంతో వీరు ఆ డబ్బు చెల్లించి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే ఇదంతా చట్టవ్యతిరేకంగా జరుగుతోంది. ఈ పనులను కొన్ని మానవ అక్రమ రవాణా గ్యాంగులు చేస్తున్నట్లు అనుమానాలున్నాయి. వీరు టిక్ టాక్ వంటి వీడియోలతో ఆడపిల్లలను ట్రాప్ చేసి, వారిని ఇలా చైనా మగవాళ్లకు అమ్మేస్తున్నారని సమాచారం.

Next Story