China: అమెరికా- చైనా మధ్య ట్రేడ్ వార్.. విజేతలు ఉండరన్న బీజింగ్

by Shamantha N |

చైనా (China)పై 10శాతం టారీఫ్‌ విధిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. దీనిపైనే చైనా సంచలన వ్యాఖ్యలు చేసింది.

China: అమెరికా- చైనా మధ్య ట్రేడ్ వార్.. విజేతలు ఉండరన్న బీజింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: చైనా (China)పై 10శాతం టారీఫ్‌ విధిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. దీనిపైనే చైనా సంచలన వ్యాఖ్యలు చేసింది. జాతీయ ప్రయోజనాలను తమ దేశం కాపాడుకోగలదని చైనా విదేశాంగశాఖ స్పందించింది. ‘‘వాణిజ్య లేదా సుంకాల యుద్ధంలో ఎవరూ విజేతలుగా ఉండరని బలంగా నమ్ముతున్నాం. ఇక మా దేశ ప్రయోజనాలకు కాపాడుకోవడానికి కట్టుబడి ఉన్నాం’’ అని చైనా ప్రతినిధి మావో నింగ్‌ వెల్లడించారు. "అమెరికాతో కమ్యూనికేషన్‌ను కొనసాగించడానికి, విభేదాలను పరిష్కరించుకునేందు పరస్పర ప్రయోజనకరమైన సహకారాన్ని విస్తరించేందుకు, స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఇరుదేశాల సంబంధాలు బలోపేతం చేసేందుకు చైనా కట్టుబడి ఉందన్నారు. అంతకు ముందు చైనా వైస్‌ ప్రీమియర్‌ డింగ్‌ ఝుజియాంగ్‌ కూడా ఇలానే స్పందించారు. “రక్షణాత్మక వైఖరి ఎక్కడికీ మార్గం చూపదు.. అలాగని వాణిజ్య యుద్ధంలో విజేతలు లేరు’’ అని పేర్కొన్నారు. ఆయన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు.

సుంకాలు విధిస్తున్న ట్రంప్

ఇకపోతే, అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్ సుంకాల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికోలపై అదనపు టారీఫ్‌లు విధిస్తామని ప్రకటించారు. ఇక ఇప్పుడు, చైనాను సైతం వదల్లేదు. ‘‘ఫెంటనిల్‌ డ్రగ్‌ను చైనా వివిధ మార్గాల్లో మెక్సికో, కెనడాకు తరలిస్తోందన్నది వాస్తవం. దాని ఆధారంగానే ఆ దేశంపై 10శాతం అదనపు సుంకాలు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నాం. ఫిబ్రవరి 1 నుంచి పెరిగిన టారీఫ్ ను అమలు చేసేందుకు చూస్తున్నాం’’ అని ట్రంప్‌ ప్రకటించారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో గతవారం జరిపిన సంభాషణను ట్రంప్‌ ప్రస్తావించారు. డ్రగ్స్‌ వ్యాపారం చేసే వారికి మరణశిక్ష విధించాలని జిన్‌పింగ్‌ భావిస్తున్నారన్నారు. అది అమలైతే మెక్సికో, కెనడా తదితర దేశాలకు చైనా ఫెంటనిల్‌ సరఫరా చేయలేరని తెలిపారు.

Next Story