- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒక్క చేప కోసం 300 డ్యామ్‌లు కూల్చివేత
చైనా పర్యావరణ పరిరక్షణలో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో 2020 నుంచి ఇప్పటివరకు 300కు పైగా డ్యామ్‌లను తొలగించగా..

దిశ, వెబ్‌డెస్క్: చైనా పర్యావరణ పరిరక్షణలో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో 2020 నుంచి ఇప్పటివరకు 300కు పైగా డ్యామ్‌లను తొలగించగా, 373 హైడ్రోఎలక్ట్రిక్ స్టేషన్లలో 342 చిన్న హైడ్రోపవర్ ప్లాంట్ల కార్యకలాపాలను నిలిపివేసింది. ఈ చర్యలు ప్రముఖంగా ఒక చేప జాతి, నదుల సహజ జీవవ్యవస్థను రక్షించడానికే చేపట్టినవిగా సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది.
ఆసియాలో అతి పొడవైన యాంగ్జీ నది (Yangtze River) చైనాలో ఆహార భద్రత, ఆర్థికవ్యవస్థకు ప్రధానాధారంగా నిలుస్తోంది. గత దశాబ్దాల్లో ఈ నదిపై భారీగా డ్యామ్‌లు, పవర్ ప్రాజెక్టులు నిర్మించడంతో నది ప్రవాహం, అక్కడి జీవవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. యాంగ్జీకి ఉపనదిగా ఉన్న చిషుయ్ హే (Red River)లో అరుదైన, స్థానిక చేప జాతులకు వాసస్థలంగా ఉంది. కానీ డ్యామ్‌లు, పవర్ స్టేషన్లు ఈ నదిలోని నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడంతో ఆ ప్రాంతాలు ఎండిపోయాయి. దీంతో కొన్ని జాతులు అంతరించిపోవడం మొదలైంది.
ఈ పరిణామాల నేపథ్యంలో.. 2022లో యాంగ్జీ స్టర్జన్ (Yangtze Sturgeon) అనే అరుదైన చేపను అంతరించిపోతున్న జాతిగా గుర్తించారు. 1970ల నుంచి ఈ చేపల సంఖ్య తగ్గిపోతూనే ఉంది. ఇందుకు ప్రధాన కారణాలు డ్యామ్‌లు నిర్మించడం, అధిక మత్స్య వ్యవసాయం. అయితే.. తాజా పునరుద్ధరణ చర్యలతో ఈ జాతి తిరిగి బలపడుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2023, 2024 సంవత్సరాల్లో రెండు విడతలుగా యాంగ్జీ స్టర్జన్‌లను నదిలోకి వదిలారు. అవి విజయవంతంగా జీవించడాన్ని పరిశోధకులు నమోదు చేశారు. ఇది రెడ్ రివర్ పునరుద్ధరణకు శుభసూచకంగా పరిగణిస్తున్నారు.






