యూఎస్‌కు ‘సోయాబీన్స్‌’ షాకిచ్చిన చైనా.. అమెరికా నుంచి దిగుమతులు కట్

by Phanindra |

యూఎస్‌కు ‘సోయాబీన్స్‌’ షాకిచ్చింది చైనా. అమెరికా నుంచి చేసుకునే భారీ దిగుమతులను తగ్గించేసింది. దీంతో ఆ దేశ రైతులు తలలు బాదుకుంటున్నారు.

యూఎస్‌కు ‘సోయాబీన్స్‌’ షాకిచ్చిన చైనా.. అమెరికా నుంచి దిగుమతులు కట్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంతో సుంకాల యుద్ధం చేస్తున్న అమెరికాకు బ్రిక్స్ దేశాలు మరో షాకిచ్చాయి. భారత్‌పై యూఎస్ భారీగా సుంకాలు వేయడంతో ఇండియన్ ఉత్పత్తులను తమ దేశ మార్కెట్లలోకి స్వాగతిస్తున్నామని రష్యా, చైనా ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బ్రెజిల్‌కు కూడా చైనా మద్దతిచ్చింది. బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు, తన మిత్రుడు జైర్ బొల్సనారోపై కేసులను ప్రస్తావించిన ట్రంప్.. ఆ దేశంపై కూడా 50 శాతం సుంకాలు విధించారు. ఈ నేపథ్యంలో ఆ దేశాధ్యక్షుడు లూయిజ్ ఇనాషియో లూలా డ సిల్వతో చైనా ప్రెసిడెంట్ జీ జిన్‌పింగ్ గంటసేపు కాల్ మాట్లాడారు.

బ్రెజిల్ న్యాయపరమైన హక్కులు, ఆసక్తులకు మద్దిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత యూఎస్ సోయాబీన్స్ ఎగుమతులను టార్గెట్ చైనా టార్గెట్ చేసింది. ప్రపంచంలోనే అత్యధికంగా సోయాబీన్స్ దిగుమతి చేసుకునే డ్రాగన్ కంట్రీ.. యూఎస్ నుంచి కూడా భారీగా దిగుమతి చేసుకునేది. ఈ కొనుగోళ్లను చాలావరకు చైనా తగ్గించేసింది. అదే సమయంలో బ్రెజిల్ నుంచి సోయాబీన్స్ దిగుమతులను భారీగా పెంచుకుంది. ఈ ఏడాది జులైలో యూఎస్ నుంచి 4.2 లక్షల టన్నుల సోయాబీన్స్‌ను చైనా దిగుమతి చేసుకుంది. గతేడాది జులైతో పోలిస్తే ఇది 11.47 శాతం తక్కువ కావడం గమనార్హం.

గతేడాదితో పోలిస్తే చైనా సోయాబీన్స్ దిగుమతులు 19 శాతం పెరిగినప్పటికీ.. దీంట్లో 90 శాతం బ్రెజిల్ నుంచి, కేవలం 4 శాతమే యూఎస్ నుంచి చైనాకు వెళ్లాయి. ఇలా యూఎస్‌ను వదిలి బ్రెజిల్‌కు చైనా మారడం వల్ల అమెరికా రైతులకు వేలకోట్లలో నష్టం వాటిల్లే ప్రమాదముంది. ఈ క్రమంలోనే ఇవే పరిస్థితులు కొనసాగితే తాము చాలా ఇబ్బందులు పడతామని, బతకడం కష్టమవుతుందని సోయాబీన్స్ రైతులు ఇప్పటికే ట్రంప్‌కు లేఖలు రాసినట్లు సమాచారం.

Next Story