మీ ఆటలు ఇక్కడ సాగనివ్వం.. వాట్సాప్‍కు సుప్రీంకోర్టు వార్నింగ్

by Prasad Jukanti |   (  Updated:2026-02-03 07:06:21  IST  )

వాట్సాప్ గోప్యతా విధానంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు టెక్ దిగ్గజం మెటాకు కఠిన హెచ్చరిక జారీ చేసింది.

మీ ఆటలు  ఇక్కడ సాగనివ్వం.. వాట్సాప్‍కు సుప్రీంకోర్టు వార్నింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దిగ్గజ టెక్ సంస్థ మెటాపై (Meta) సుప్రీంకోర్టు (Supreme Court) సీరియస్ అయింది. భారత చట్టాలను పాటించకపోతే దేశం విడిచి వెళ్లిపోవచ్చంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. వాట్సాప్ గోప్యతా విధానంపై (WhatsApp Privacy Policy) ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వాట్సాప్ మాతృసంస్ధ మెటాను సీజేఐ జస్టిస్ సూర్యాకాంత్ (CJI Surya Kant) తీవ్రంగా హెచ్చరించారు.' మా దేశ ప్రజల గోప్యతతో మీరు ఆటలాడలేరు. మా డేటాలో సింగిల్ డిజిట్ కూడా పంచుకునేందుకు మేము అనుమతించమని స్పష్టం చేశారు. భారత చట్టాలను పాటించడం ఇష్టం లేకపోతే ఈ దేశం విడిచిపెట్టవచ్చని సీరియస్ కామెంట్స్ చేశారు.

కేసు నేపథ్యం:

వాట్సాప్ 2021 గోప్యతా విధాన నవీకరణను పరిశీలిస్తూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) నవంబర్ 2024లో జారీ చేసిన ఉత్తర్వుల నుండి ఈ వివాదం తలెత్తింది. మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని ఉపయోగించి వినియోగదారులను కొత్త గోప్యతా విధానాన్ని తప్పనిసరిగా అంగీకరించేలా వాట్సాప్ ఒత్తిడి తీసుకువచ్చిందని సీసీఐ పేర్కొంది. వాట్సాప్ మెసేజింగ్ సేవలను కొనసాగించాలంటే మెటా ఇతర ప్లాట్‌ఫార్మ్‌లతో డేటా పంచుకోవడానికి అనుమతి ఇవ్వాల్సిందేనని వినియోగదారులకు తెలిపిందని సీసీఐ ఆక్షేపించింది. ఈ చర్య పోటీ చట్టానికి విరుద్ధమని భావించి రూ.213 కోట్ల జరిమానా విధిస్తూ ఆదేశించింది. ఈ ఉత్తర్వును మెటా, వాట్సాప్ 2025 జనవరిలో సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. 2025 నవంబర్‌లో న్యాయ ట్రైబ్యునల్ వాట్సాప్ డేటా షేరింగ్‌పై ఐదేళ్ల నిషేధాన్ని రద్దు చేసింది. అయితే రూ.213 కోట్ల జరిమానాను మాత్రం యథాతథంగా ఉంచింది. తాజాగా ఇవాళ విచారణ జరిపిన ధర్మాసనం మెటా తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.

బెంగాల్ ప్రభుత్వం 'అభివృద్ధి వ్యతిరేకి'..కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సంచలన వ్యాఖ్యలు!

Next Story