సామూహిక వివాహాల్లో పెళ్లి చేసుకున్న ఎమ్మెల్యే.. ఎడ్లబండిపై ఊరేగించిన డిప్యూటీ సీఎం

by Naga Rani Yarlagadda |

సామూహికంగా వివాహాలు చేసుకుంటున్న జంటలతో కలిసి.. ఎమ్మెల్యే కూడా సాదాసీదాగా ప్రభుత్వ ఖర్చులతో పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశమైంది.

సామూహిక వివాహాల్లో పెళ్లి చేసుకున్న ఎమ్మెల్యే.. ఎడ్లబండిపై ఊరేగించిన డిప్యూటీ సీఎం
X

దిశ, వెబ్‌డెస్క్: సామూహికంగా వివాహాలు చేసుకుంటున్న జంటలతో కలిసి.. ఎమ్మెల్యే కూడా సాదాసీదాగా ప్రభుత్వ ఖర్చులతో పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశమైంది. సరికొత్తగా ఆదర్శవంతంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు ఛత్తీస్ గఢ్ వేదికగా మారింది. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల పెళ్లిళ్లంటే.. కోట్లరూపాయల ఖర్చు, ఎన్నో ఆడంబరాలు, విలాసవంతమైన ఏర్పాట్లు, కళ్లు చెదిరే వేదికలు.. ఇవే గుర్తొస్తాయి. కానీ.. ఇందుకు పూర్తి భిన్నంగా అధికారపార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రభుత్వ సామూహిక వివాహ వేదికపై నిరాడంబరంగా పెళ్లి చేసుకొని దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బెమేతరా (Bemetara) నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే దీపేష్ సాహు (MLA Deepsh Sahu Marriage).. ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించే ముఖ్యమంత్రి కన్యా వివాహ యోజన కింద తరుణా సాహు అనే యువతిని వివాహం చేసుకున్నారు.

ఎడ్లబండిపై బరాత్ - సారథిగా డిప్యూటీ సీఎం

బెమేతరా జిల్లాలో నిర్వహించిన ఈ సామూహిక వివాహ మహోత్సవంలో ఎమ్మెల్యే దంపతులతో పాటు మరో 20కి పైగా నిరుపేద జంటలు ఒకే వేదికపై వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాయి. ఈ పెళ్లికి ఎమ్మెల్యే దీపేష్ సాహు సాంప్రదాయబద్ధంగా ఎడ్లబండిపై ఊరేగింపుగా రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతకంటే విశేషం ఏమిటంటే.. ఆ ఎడ్లబండి తాళ్లను ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి అరుణ్ సావ్ స్వయంగా చేతబూని నడపడం రాజకీయ, సాంస్కృతిక వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. వీఐపీ సంస్కృతికి స్వస్తి పలికి సామాన్యులతో కలిసి పెళ్లి చేసుకున్న ఎమ్మెల్యేను చూసేందుకు వేలాది మంది జనం తరలివచ్చారు.

యువతకు ఒక మంచి ఉదాహరణ: సీఎం విష్ణు దేవ్ సాయ్

ఎమ్మెల్యే దీపేష్ సాహు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయ్ ప్రశంసించారు. నేటి కాలంలో పెళ్లిళ్ల ఖర్చుల కోసం కుటుంబాలు అప్పులపాలవుతున్న తరుణంలో.. ఈ అడుగు సమాజానికి ఒక గొప్ప సానుకూల సందేశాన్ని ఇచ్చిందని కొనియాడారు. "దీపేష్ సాహు నేటి యువతకు ఆదర్శంగా నిలిచారు. అనవసరపు ఆడంబరాలకు పోకుండా, వీలైతే ముఖ్యమంత్రి కన్యా వివాహ్ యోజన కింద పెళ్లి చేసుకోవాలని నేనే గతంలో ఆయనకు సూచించాను" అని సీఎం పేర్కొన్నారు.

Next Story