బెంగాల్‌లో మార్పు తథ్యం: 'ఝాల్ మురీ'తో టీఎంసీకి చురకలు అంటించిన ప్రధాని మోడీ

by Malleboina Mahesh |   (  Updated:2026-04-23 08:55:24  IST  )

నదియా సభలో ప్రధాని మోదీ టీఎంసీపై విమర్శలు గుప్పించారు. ఝాల్ మురీ తాను తింటే మంట టీఎంసీకి తగిలిందని ఎద్దేవా చేస్తూ, బెంగాల్‌లో బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

బెంగాల్‌లో మార్పు తథ్యం: ఝాల్ మురీతో టీఎంసీకి చురకలు అంటించిన ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళిపై ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లోని నదియా లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ రోజు రికార్డు స్థాయిలో నమోదవుతున్న పోలింగ్ శాతం బీజేపీ విజయానికి సంకేతమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఎక్కడైతే భారీగా ఓటింగ్ జరిగిందో, అక్కడ బీజేపీ ఘన విజయం సాధించిందని ఆయన గుర్తు చేశారు. మే 4వ తేదీన (ఫలితాల రోజు) బెంగాల్ వ్యాప్తంగా బీజేపీ విజయోత్సవాలు జరుగుతాయని, ఆ రోజు మిఠాయిలతో పాటు బెంగాల్ ప్రత్యేక వంటకం 'ఝాల్ మురీ' (Jhal Muri) కూడా పంచుతామని చమత్కరించారు.

'ఝాల్ మురీ' రాజకీయం..

ఇటీవల ప్రధాని మోడీ ఒక రోడ్డు పక్కన బండి వద్ద 'ఝాల్ మురీ' తిన్న ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాని స్పందిస్తూ.. "ఝాల్ మురీ నేను తిన్నాను కానీ, దాని కారం (మంట) మాత్రం టీఎంసీకి తగిలింది" అంటూ చురకలు అంటించారు. ఝాల్ మురీ పేరు వింటేనే కొంతమందికి షాక్ తగులుతోందని సందర్భంగా ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు.

ఎన్నికల సంఘానికి అభినందనలు..

గత 50 ఏళ్లలో హింస అతి తక్కువగా జరిగిన ఎన్నికలు ఇవేనని ప్రధాని ప్రశంసించారు. ఒకప్పుడు బెంగాల్‌లో ప్రతి వారం ఎవరో ఒకరిని ఉరితీసి, దానిని ఆత్మహత్యగా చిత్రీకరించే అరాచక పాలన ఉండేదని ఆరోపించారు. బెంగాల్ గడ్డపై ప్రజాస్వామ్య గౌరవాన్ని మళ్ళీ పునరుద్ధరించినందుకు ఎన్నికల కమిషన్‌ను ఆయన అభినందించారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా నిష్పక్షపాతంగా పని చేస్తున్నారని కొనియాడారు. బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అందుకే ఓటర్లు పాత రికార్డులను చెరిపివేస్తూ పోలింగ్ కేంద్రాలకు పోటెత్తుతున్నారని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

బెంగాల్ ఎన్నికల్లో హింస..ముర్షిదాబాద్‌లో టీఎంసీ - ఏయూజేపీ మధ్య రణరంగం

Next Story