- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చైనా డ్యాంతో డేంజరే.. నీటిని ఆపేస్తే భారత్, భూటాన్, బంగ్లాదేశ్‌కు తిప్పలు!
చైనా డ్యాంతో డేంజరే పర్యావరణానికే కాదు ఇతర దేశాలకూ డేంజరే. బ్రహ్మపుత్ర నీటిని ఆపేస్తే భారత్, భూటాన్, బంగ్లాదేశ్‌కు తిప్పలు తప్పవంటున్న నిపుణులు.

దిశ, నేషనల్ బ్యూరో: బ్రహ్మపుత్ర నదిపై భారీ డ్యాం నిర్మించేందుకు చైనా రెడీ అయింది. ఈ పనులను తాజాగా ప్రారంభించింది కూడా. ఆ దేశంలోనే అతి పెద్ద ‘త్రీ గార్జెస్ డ్యాం’ కన్నా ఇది పెద్దది. చైనాలోని యాంగ్‌జీ నదిపై ఉన్న ఈ డ్యాం వల్ల ఏకంగా భూభ్రమణ వేగంలో మార్పు వచ్చిందని పరిశోధకులు అంటారు. ఇప్పుడు అంతకన్నా భారీ ప్రాజెక్టు కడితే వాతావరణంపై అది ఎంత తీవ్రప్రభావం చూపిస్తుందో? అని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. దానికితోడు బ్రహ్మపుత్ర నది నీటిపైనే భూటాన్, భారత్, బంగ్లాదేశ్‌లలో పలు ప్రాంతాలు ఆధారపడి ఉన్నాయి. చైనా కనుక అంత భారీ డ్యాం నిర్మించి, నీటిని అక్కడే ఆపేస్తే.. ఈ ప్రాంతాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాయి. దానికితోడు ఈ నది చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో నివశించే ప్రజల జీవన విధానం చాలా దెబ్బతినే అవకాశం ఉంది.
తాము ఇక్కడ కడుతోంది హైడ్రో పవర్ ప్రాజెక్టని, ఇక్కడి నుంచి ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేసి టిబెట్‌తోపాటు దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా దాన్ని సరఫరా చేసుకుంటామని చైనా అంటోంది. పైకి ఈ మాటలే చెప్తున్నా.. సడెన్‌గా నది నీటిని నిలిపివేస్తే పరిస్థితేంటి? అని భారత్‌లో నిపుణులు ఆందోళన చెందుతున్నారు. సింధూ జలాలా ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో పాక్‌లో నీటి ఎద్దడి ఎంత తీవ్రతరంగా మారిందో అందరికీ తెలిసిందే. చైనా కనుక ఈ డ్యాంతో బ్రహ్మపుత్ర నదిని నిలిపివేస్తే.. ఈశాన్య భారత్‌లో కూడా ఇలాంటి పరిస్థితే ఏర్పడే అవకాశం ఉందనేది పలువురి ఆందోళన.
అదే సమయంలో టిబెట్‌లోని హిమానీ నదాల నుంచి వచ్చే నదుల ప్రవాహాన్ని ఇలా కృత్రిమంగా నిలిపివేయడం ఇక్కడి పర్యావరణానికి ఏమాత్రం మంచిది కాదని పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా హెచ్చరిస్తున్నారు. వీటి వల్లనే రుతుపవనాల వంటి కీలకమైన వాతావరణ వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఈ డ్యాం కడితే వీటిపై నెగిటివ్ ప్రభావం పడే అవకాశం ఉంది. వాతావరణంలో మార్పుల వల్ల ఇప్పటికే హిమాలయాల్లో పుట్టే నదుల్లో అప్పుడప్పుడూ భయంకరమైన వరదలు వస్తున్నాయి. 2023 అక్టోబరులో ఇలాంటి వరద వల్లనే సిక్కింలోని చుంగ్‌థాంగ్ డ్యాం కూలిపోయిందని నిపుణుల అంచనా. ఈ డ్యాం కూలడంతో దిగువ ప్రాంతాలు తీవ్రమైన నష్టం ఎదుర్కొన్నాయి.
వీటన్నింటికీ తోడు చైనా ఇప్పుడు డ్యాం నిర్మిస్తున్న ప్రాంతం కూడా చాలా ప్రమాదకరమైనదనే చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలోనే ఆధునిక కాలంలో వచ్చిన అతిపెద్ద భూకంపం ‘1950 మెడాగ్ భూకంపం’ వచ్చింది. దీన్ని అస్సాం-టిబెట్ భూకంపం అని కూడా అంటారు. ఈ భూకంపం వల్ల అస్సాం, బంగ్లాదేశ్‌లో తీవ్రమైన నష్టం కలిగింది. దీని ఇప్పుడు చైనా భారీ డ్యాం కట్టాలనుకుంటున్న ప్రాంతంలోనే ఈ భూకంపం కేంద్రీకృతమైందని నిపుణులు అప్పట్లోనే చెప్పారు. ఇప్పుడు అదే ప్రాంతంలో డ్యాం కడితే ఎలాంటి ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఊహించడం కష్టం. ఈ డ్యాం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. అలాంటి సమయంలో మరో భారీ భూకంపం వస్తే తట్టుకోవడం చాలా ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.






