Indus Waters: సింధు జలాల వినియోగంపై కేంద్రం అధ్యయనం

by S Gopi |   (  Updated:2025-04-26 16:22:31  IST  )

ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ఇప్పటికే కేంద్రం కసరత్తు ప్రారంభించిందని తెలుస్తోంది.

Indus Waters: సింధు జలాల వినియోగంపై కేంద్రం అధ్యయనం
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లోని పెహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పాక్‌పై ఆగ్రహంతో సింధు జలాలను నిలిపేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నిర్ణయం తర్వాత సింధు నది జలాలను భారత్ ఎలా వినియోగిస్తుందనే సందేహం అందరిలో ఉంది. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ఇప్పటికే కేంద్రం కసరత్తు ప్రారంభించిందని తెలుస్తోంది. సింధు నది జలాలను నిల్వ చేయడం గురించి అధ్యయనం చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. సింధు నది నీటిని సాధ్యమైనంత ఎక్కువగా వాడుకోవడంపై కేంద్రం దృష్టి సారించిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీనికోసం ఒక అధ్యయనాన్ని చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. దీనిపై ఇప్పటికే స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ప్రపంచబ్యాంకు మాధ్యవర్తిత్వంలో జరిగిన ఒప్పందం ప్రకారం, తూర్పున పారే సట్లెజ్, బియాస్, రావి నదుల వార్షిక ప్రవాహం 33 మిలియన్‌ ఎకరాల అడుగులు (ఎమ్‌ఏఎఫ్‌)గా ఉంది. వీటిపై భారత్‌కు ప్రత్యేక హక్కులు ఉన్నాయి. సింధు నదితో పాటు దాని పశ్చిమవైపు ఉపనదులైన జీలం, చీనాబ్‌లపై( సామర్థ్యం 135 ఎమ్‌ఏఎఫ్‌) పాకిస్థాన్‌కు ఎక్కువ హక్కులు లభించాయి. భారత ప్రభుత్వం తాజా ఒప్పందం రద్దు కారణంగా సింధు, జీలం, చీనాబ్ నదీ జలాలను వాడుకునేందుకు అవకాశం లభించింది. సింధూ పరీవాహక నదుల జలాలను స్వల్ప, మధ్యస్థ, దీర్ఘకాలానికి వాడుకునేందుకు అవకాశాలను అన్వేషిస్తోంది. దీని కోసం జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, కేంద్ర మంత్రులు అమిత్ షా, మనోహర్ లాల్ ఖట్టర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సింధు జలాల నిల్వపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చినట్టు సమాచారం. నదీ జలాలను మళ్లించడం, భవిష్యత్తులో ఎలా వాడుకోవాలనే అంశాలపై చర్చించారు. ఇదే సమయంలో సింధు జలాలను వాడుకోవడంలో పరిశీలించాల్సిన చట్టపరమైన, సాంకేతిక విషయాలను కూడా ప్రస్తావించారు.

మళ్లించడం సాధ్యమేనా?

జరిగిన దారుణ కుట్రకు బదులుగా భారత్ కఠిన నిర్ణయంలో భాగంగా సింధు జలాలను పాక్‌కు వెళ్లకూడదని నిర్ణయించింది. అయితే, ఆ నీటిని నిల్వ చేయడంతో పాటు మళ్లించేందుకు కావాల్సిన వసతులు లేకపోవడం వెంటనే నీటి ప్రవాహాన్ని ఆపడం క్లిష్టంగా ఉంటుందని దక్షిణాసియా నెట్‌వర్క్ ఆన్ డ్యామ్స్ అండ్ పీపుల్ ప్రతినిధి హిమాన్షు టక్కర్ చెప్పారు. ప్రవాహాన్ని ఆపేందుకు సింధు, జీలం, చీనాబ్ నదులపై ప్రాజెక్టులను కట్టాల్సి ఉంటుంది. అప్పటిదాకా జలాలను మళ్లించడం అతిపెద్ద సవాలు కానుంది.

Next Story