పేపర్ లీక్‌లపై కేంద్రం ఉక్కుపాదం.. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు రెడీ

by Kema Shiva Kumar |

పోటీ పరీక్షా పేపర్ల లీకేజీలకు చెక్ పెట్టేందుకు కేంద్రం కీలక అడుగు వేయబోతోంది.

పేపర్ లీక్‌లపై కేంద్రం ఉక్కుపాదం.. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు రెడీ
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వేళ ఉభయ సభలను ‘నీట్’ పరీక్ష పేపర్ లీక్‌పై సీజేపీ ఆధ్వర్యంలో విద్యార్థుల చేపట్టిన ఆందోళనలు కుదిపేశాయి. అయితే, తాజాగా కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో విద్యార్థులతో కిక్కిరిసిన జంతర్‌ మంతర్ ఖాళీ అయింది. ఈ క్రమంలోనే లోక్‌సభ, రాజ్యసభ కార్యకలాపాలు యథావిధిగా సాగే అవకాశం కనిపిస్తోంది. ఇక నిలిచిపోయిన తమ కీలక శాసన ఎజెండాను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగానే భవిష్యత్తులో పోటీ పరీక్షల్లో పేపర్ లీకేజీలకు చెక్ పెట్టేందుకు ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు, 2026’ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సభ ముందుకు తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తోంది.

అయితే, ఈ సవరణ బిల్లులో మొత్తం ఏడు కీలక మార్పులను ప్రతిపాదించారు. కేసుల విచారణ కోసం ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, ఛార్జ్‌షీట్ దాఖలైన మూడు నెలల్లోగా విచారణ పూర్తి చేయడం, 2 నెలల్లోనే దర్యాప్తు ముగించాలనే నిబంధనలను చేర్చారు. ముఖ్యంగా పేపర్ లీకేజీలకు పాల్పడే ముఠాలు, కోచింగ్ సెంటర్లు, సర్వీస్ ప్రొవైడర్లపై కఠిన జైలు శిక్షలతో పాటు భారీ స్థాయిలో ఆర్థిక జరిమానాలు విధించేలా నిబంధనలను పొందుపరిచారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లుతో పాటు ఆదాయ పన్ను సవరణ బిల్లు, ఎంఎస్ఎంఈ అభివృద్ధి సవరణ బిల్లు, జనన-మరణాల నమోదు సవరణ బిల్లు వంటి పలు ఇతర ముసాయిదాలను కూడా ప్రభుత్వం ఈ వర్షాకాల సమావేశాల్లో ఆమోదింపజేసుకోవాలని భావిస్తోంది.

Next Story