ఈ ఏడాదిలోనే 8వ పే కమిషన్‌ను ఏర్పాటు చేస్తాం : కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

by Ajay Maddhiboyina |

ఇప్పటి వరకు 7 పే కమిషన్లు పని చేయగా.. రాబోయే దశాబ్దానికి కొత్తగా 8వ పే కమిషన్ ఏర్పాటు చేయనున్నారు.

ఈ ఏడాదిలోనే 8వ పే కమిషన్‌ను ఏర్పాటు చేస్తాం : కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
X

2026 నుంచి 2035 వరకు మనుగడలో ఉండే 8వ పే కమిషన్‌ను ఈ ఏడాదిలోనే ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ప్రధాని మోడీ అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. 2016లో ఏర్పాటు చేసిన 7వ పే కమిషన్ గడువు 2025 డిసెంబర్ 31తో ముగుస్తుంది. అయితే ఈ సారి ఏడాది ముందుగానే 2026 పే కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే జీతాలు, పెన్షన్లకు సంబంధించిన శాలరీ స్ట్రక్చర్‌ను పే కమిషన్ నిర్ణయిస్తుంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన 1947 నుంచి ఈ పే కమిషన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు 7 పే కమిషన్లు పని చేయగా.. రాబోయే దశాబ్దానికి కొత్తగా 8వ పే కమిషన్ ఏర్పాటు చేయనున్నారు. మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2016లో నియమించిన పే కమిషన్ ఉద్యోగులు, పెన్షనర్ల విషయంలో అనేక సిఫార్సులు చేసింది. ప్రభుత్వం ఉద్యోగులకు 14 శాతం జీతాల పెంచాలని పే కమిషన్ సిఫార్సు చేసింది. 7వ పే కమిషన్‌కు జస్టిస్ అశోక్ కుమార్ మాథుర్ చైర్మన్‌గా వ్యవహరించారు. 8వ పే కమిషన్‌కు త్వరలోనే చైర్మన్, సభ్యులను నియమిస్తామని మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.

Next Story