కేంద్రంతో ముగిసిన సీజేపీ చర్చలు : కీలక ప్రకటన చేసిన ప్రతినిధులు

by Naga Rani Yarlagadda |

నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా విద్యార్థులతో కలిసి 36 రోజులపాటు ఆందోళనలు చేసింది సీజేపీ.

కేంద్రంతో ముగిసిన సీజేపీ చర్చలు : కీలక ప్రకటన చేసిన ప్రతినిధులు
X

దిశ, వెబ్‌డెస్క్: నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా విద్యార్థులతో కలిసి 36 రోజులపాటు ఆందోళనలు చేసింది సీజేపీ. ఎట్టకేలక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో విజయం సాధించిన సీజేపీ ప్రతినిధులు.. మూడోసారి కేంద్రంతో భేటీ అయ్యారు. కేంద్రమంత్రులు జేపీ నడ్డా, జితేందర్ సింగ్ లతో సీజేపీ ప్రతినిధులు ఆశుతోష్, సౌరవ్ దాస్ భేటీ అయ్యారు. అనంతరం భేటీలో చర్చించిన అంశాలను ఇరు పక్షాలు మీడియాకు వెల్లడించాయి.

కేంద్రాన్ని ప్రధానంగా మూడు డిమాండ్ చేశామని, వాటిలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఇప్పటికే విజయం సాధించామని ఆశుతోష్ పేర్కొన్నారు. అలాగే నిరసనకారులపై ఢిల్లీలోనే కాకుండా.. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్ని కొట్టివేయడంతో పాటు భవిష్యత్ లోనూ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని కోరామని తెలిపారు. నీట్ లీక్ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న 21 విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కోరామన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చేందుకు కేంద్రం అంగీకారం తెలిపిందని ఆశుతోష్ వెల్లడించారు. కేసుల్ని ఎత్తివేసి, త్వరలోనే ఎక్స్ గ్రేషియా ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని, డిమాండ్లపై మంగళవారంలోగా లిఖితపూర్వక హామీకి కేంద్రం అంగీకారం తెలిపిందని వివరించారు. వీటిలో ధర్మేంద్ర రాజీనామానే తమ మొదటి గెలుపన్నారు. కేంద్రం విజ్ఞప్తితో ఆందోళనలు విరమిస్తున్నామని తెలిపారు.

అనంతరం జేపీ నడ్డా మీడియాతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా విద్యార్థులపై నమోదైన కేసుల్ని ఎత్తివేస్తామని తెలిపారు. అలాగే నిబంధనలకు లోబడి.. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

Next Story