ఇది ప్రాథమిక రిపోర్టే.. తొందరపడి ఎవర్నీ తప్పుపట్టొద్దు: రామ్మోహన్ నాయుడు

by Phanindra |

ఎయిరిండియా ప్రమాదంపై వచ్చిన రిపోర్టుపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఇది ప్రాథమిక రిపోర్టేనని, తొందరపడి ఎవర్నీ తప్పుపట్టొద్దని చెప్పారు.

ఇది ప్రాథమిక రిపోర్టే.. తొందరపడి ఎవర్నీ తప్పుపట్టొద్దు: రామ్మోహన్ నాయుడు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎయిరిండియా ప్రమాదంపై ఏఏఐబీ ఇచ్చిన రిపోర్టుపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఇది కేవలం ప్రాథమిక రిపోర్టు మాత్రమేనని, దీని ఆధారంగా ఎలాంటి నిర్ణయానికి రాకూడదని ఆయన చెప్పారు. విమానం గాల్లోకి లేచిన మూడు సెకన్లలోనే రెండు ఇంజిన్లకు ఫ్యూయల్ సప్లయ్ నిలిచిపోయినట్లు ఏఏఐబీ రిపోర్టు వెల్లడించింది. ఇది గమనించిన ఒక పైలట్.. ‘ఫ్యూయల్ సప్లయ్ ఎందుకు ఆపావ్?’ అని అడగ్గా మరో పైలట్ ‘నేను ఆపలేదే’ అని మాట్లాడుకున్నట్లు ఏఏఐబీ రిపోర్టు వెల్లడించింది.

దీంతో పైలట్ల తప్పిదం వల్లనే ప్రమాదం జరిగిందంటూ పాశ్చాత్య మీడియా సహా పలువురు విశ్లేషణలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఈ దర్యాప్తు ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, ఎన్నో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయని రామ్మోహన్ నాయుడు తెలిపారు. అలాంటి దర్యాప్తులో కేవలం రిపోర్టును చూసి ఒక నిర్ణయానికి రావడం కరెక్ట్ కాదన్నారు.

‘ఈ రిపోర్టును పౌరవిమానయాన శాఖ జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఇలాంటి సమయంలో తొందరపడి ఒక నిర్ణయానికి రాకూడదు. తుది నివేదిక వచ్చిన తర్వాతనే స్పష్టమైన కారణాలు వెల్లడవుతాయి’ అని చెప్పారు. అలాగే పైలట్లపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేసిన ఆయన.. ‘ప్రపంచంలోనే అద్భుతమైన పైలట్లు, క్రూ మనదేశంలో ఉన్నారు. ఏవియేషన్ వ్యవస్థకు వాళ్లే వెన్నెముక’ అని పేర్కొన్నారు.

Next Story