- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్లీపర్ బస్సుల ప్రమాదాలు.. కేంద్రం కఠిన నిబంధనలు : ఇకపై వారికి మాత్రమే అనుమతి
స్లీపర్ బస్సులు.. అందులోనూ ఏసీ స్లీపర్ బస్సులు తరచూ ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో కేంద్రం కఠిన నిబంధనలు అమలు చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: స్లీపర్ బస్సులు.. అందులోనూ ఏసీ స్లీపర్ బస్సులు తరచూ ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో కేంద్రం కఠిన నిబంధనలు అమలు చేసింది. గడిచిన 6 నెలల కాలంలో 145 మంది ప్రయాణికులను స్లీపర్ బస్సుల అగ్నిప్రమాదాలు బలిగొన్నాయి. ఈ నేపథ్యంలో స్లీపర్ బస్సుల తయారీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ కొత్త నిబంధనలను ప్రకటించారు. ఇకపై స్లీపర్ బస్సులను కేంద్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఆటో మొబైల్ కంపెనీలు లేదా తయారీసంస్థలు మాత్రమే నిర్మించేలా నిబంధనలు విధించినట్లు తెలిపారు. కొత్త ఫ్రేమ్ వర్క్ ప్రకారం.. స్థానిక, మాన్యువల్ బాడీ బిల్డర్లకు ఇకపై స్లీపర్ బస్సులను నిర్మించే అనుమతి లేదని స్పష్టం చేశారు.
అగ్నిప్రమాదాలకు ప్రధాన కారణం ఇవే
ఇటీవల జరిగిన బస్సుప్రమాదాల నివేదికలను పరిశీలిస్తే.. ప్రమాద తీవ్రతకు బస్సులో త్వరగా మండే స్వభావం ఉండే మెటీరియల్ ప్రధాన కారణంగా కనిపించిందని గడ్కరీ పేర్కొన్నారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ను మూసివేసేలా బెర్తులు ఉండటం, ఎమర్జెన్సీ విండోలు లేకపోవడంతో చాలా మందికి మరణించారని, అగ్నిప్రమాదం నుంచి తప్పించుకునేందుకు వాడే వస్తువులు కూడా బస్సులో లేకపోవడం కూడా ఒక కారణంగా తెలిపారు. అందుకే సెప్టెంబర్ 1, 2025 నుంచి అమల్లోకి వచ్చిన సవరించిన బాడీకోడ్ AIS-052 (ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ -05) ప్రకారం.. స్లీపర్ బస్సులను గుర్తింపు పొందిన సంస్థలు మాత్రమే నిర్మించాలన్న నిబంధనలను కఠినతరం చేస్తున్నట్లు వివరించారు.
రీట్రోఫిట్ చేయాల్సిందే
ఇప్పటికే ఉన్న స్లీపర్ బస్సులను పరిశీలించి, రీట్రోఫిట్ చేయాల్సిన అవసరం ఉందని కేంద్రం పేర్కొంది. స్లీపర్ బస్సుల్లో ఫైర్ యాక్సిడెంట్ రికగ్నైజ్ సిస్టమ్స్, ఎమర్జెన్సీ లైటింగ్, డైవర్ నిద్రమత్తులో ఉంటే హెచ్చరించే వ్యవస్థలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్, సేఫ్టీ సుత్తులను పెట్టాలని ఆదేశించింది. భవిష్యత్తులో విషాదాలను నివారించడం, లాంగ్ జర్నీల్లో స్లీపర్ కోచ్ సేవల్లో ప్రయాణికుల భద్రతను గణనీయంగా మెరుగుపరచడం లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రప్రభుత్వం పేర్కొంది.






