చిన్న నీటి విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్రం బూస్ట్.. రూ.2,584 కోట్ల పథకానికి కేబినెట్ ఆమోదం

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-18 12:25:47  IST  )

చిన్న నీటి విద్యుత్ ప్రాజెక్టుల (SHP) కోసం సరికొత్త పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక సాయంతో పాటు లక్షలాది మందికి ఉపాధి కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

చిన్న నీటి విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్రం బూస్ట్.. రూ.2,584 కోట్ల పథకానికి కేబినెట్ ఆమోదం
X

దిశ, వెబ్‌డె‌స్క్: దేశంలో పునరుత్పాదక ఇంధన రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ‘స్మాల్ హైడ్రో పవర్ (SHP) డెవలప్‌మెంట్ స్కీమ్’కు ఆమోదం లభించింది. ఆర్థిక సంవత్సరం 2026-27 నుంచి 2030-31 వరకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. రూ.2,584 కోట్లతో 1500 మెగావాట్ల లక్ష్యంఈ ప్రతిష్టాత్మక పథకం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2584.60 కోట్ల భారీ వ్యయాన్ని కేటాయించింది. దీంతో దేశవ్యాప్తంగా సుమారు 1500 మెగావాట్ల (MW) విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల చిన్న నీటి విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానంగా 1 నుంచి 25 మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టులకు ఈ పథకం కింద మద్దతు లభిస్తుంది. రాష్ట్రాలకు లభించే ఆర్థిక ప్రోత్సాహకాలు ఈ పథకం ద్వారా కొండ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలకు మెరుగైన ప్రయోజనం చేకూరనుంది.

ఈశాన్య, సరిహద్దు జిల్లాలు..

ప్రస్తుతం అంతర్జాతీయ సరిహద్దులు కలిగిన జిల్లాలు, ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు కేంద్రం నుంచి మెగావాట్‌కు రూ.3.6 కోట్లు, ప్రాజెక్టు వ్యయంలో 30శాతం ఆర్థిక సాయం అందుతుంది. దీని గరిష్ట పరిమితి ఒక్కో ప్రాజెక్టుకు రూ.30 కోట్లుగా నిర్ణయించారు. ఇక మిగిలిన రాష్ట్రాల్లో మెగావాట్‌కు రూ.2.4 కోట్లు, ప్రాజెక్టు వ్యయంలో 20 శాతం సాయం లభిస్తుంది. దీనిపై రూ.20 కోట్ల గరిష్ట పరిమితి (Cap) ఉంటుంది. పెట్టుబడులు, ఉపాధి కల్పన ఈ పథకం అమలు ద్వారా చిన్న నీటి విద్యుత్ రంగంలో సుమారు రూ.15 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని కేంద్రం అంచనా వేస్తోంది. ఇది గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా, ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సుమారు 51 లక్షల పని దినాల ఉపాధిని కల్పిస్తుంది.

పర్యావరణ హితం- ఆత్మనిర్భర్ భారత్ స్వదేశీ యంత్రాలు..

ఈ ప్రాజెక్టులలో ఉపయోగించే ప్లాంట్, యంత్రాలు 100 శాతం స్వదేశీ వనరుల నుంచే సేకరించడం ద్వారా ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి తోడ్పడనున్నాయి. ఇవి వికేంద్రీకృత ప్రాజెక్టులు కావడం వల్ల పొడవైన ట్రాన్స్‌మిషన్ లైన్ల అవసరం ఉండదు. ఫలితంగా విద్యుత్ ప్రసార నష్టాలు తగ్గుతాయి. ఇక పెద్ద ప్రాజెక్టుల మాదిరిగా భారీ భూసేకరణ, అడవుల నరికివేత లేదా జనాభా తరలింపు వంటి సమస్యలు ఈ చిన్న ప్రాజెక్టుల వల్ల తలెత్తే అవకాశం కూడా లేదు. భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులను సిద్ధం చేసేలా సుమారు 200 ప్రాజెక్టుల సమగ్ర నివేదికల (DPR) తయారీకి కేంద్ర ప్రభుత్వం రూ.30 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టుల జీవితకాలం 40 నుంచి 60 ఏళ్ల వరకు ఉండటం వల్ల మారుమూల ప్రాంతాల్లో దీర్ఘకాలిక సామాజిక-ఆర్థిక అభివృద్ధికి ఇవి సరికొత్త బాటలు వేయనున్నాయి.

ఇక భూ నిర్వాసితులకు తీపికబురు..

దేశవ్యాప్తంగా అభివృద్ధి ప్రాజెక్టులకు భూసేకరణ ప్రధాన అడ్డంకిగా మారిన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ‘భవ్య’ (BHAVYA - భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన) అనే వినూత్న పథకానికి శ్రీకారం చుట్టనుంది. ఈ పథకం ద్వారా రానున్న ఆరేళ్ల కాలంలో (2026-27 నుంచి 2031-32 వరకు) దేశవ్యాప్తంగా కనీసం 100 ‘ప్లగ్ అండ్ ప్లే’ పారిశ్రామిక పార్కులను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం సుమారు 34 వేల ఎకరాల భూమిని సేకరించనుండగా, బడ్జెట్‌లో రూ.33,600 కోట్లను కేటాయించింది. ఒక్కో పార్కు కనీసం 100 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. భూమి ధర ఎకరానికి కోటి రూపాయల కంటే ఎక్కువ ఉన్న పక్షంలో, కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా రూ. కోటి వరకు సమకూరుస్తుంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ప్రైవేటు భాగస్వాములు భరించాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యంతో ‘ఛాలెంజ్ మోడల్’లో ఈ ప్రాజెక్టులను ఎంపిక చేస్తారు. ఈ పథకం భూసేకరణ సమస్యలను పరిష్కరించడమే కాకుండా, 'మేక్ ఇన్ ఇండియా', 'ఆత్మనిర్భర్ భారత్' స్ఫూర్తితో భారీగా ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని కేంద్ర క్యాబినెట్ పేర్కొన్నది.

అదేవిధంగా 2023-24 పత్తి సీజన్‌ MSP రీయింబర్స్‌మెంట్‌‌కు గాను రూ.11,712 కోట్లను కేటాయింపు, NH-92 బారాబంకి నుంచి బహ్రైచ్ సెక్షన్ వరకు నాలుగు లేన్ల నిర్మాణానికి రూ.6,969 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.

Next Story