నేటి నుంచే జనాభా గణన షురూ.. 8 రాష్ట్రాల్లో ఇంటింటికీ వెళ్లనున్న ఎన్యూమరేటర్లు

by Kema Shiva Kumar |

జనాభా గణన - 2027లో భాగంగా నేటి నుంచి మొదటి దశ ప్రారంభమైంది. కర్ణాటక, ఢిల్లీ సహా 8 రాష్ట్రాల్లో ఎన్యూమరేటర్లు సర్వేను ప్రారంభించారు.

నేటి నుంచే జనాభా గణన షురూ.. 8 రాష్ట్రాల్లో ఇంటింటికీ వెళ్లనున్న ఎన్యూమరేటర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ‘జనాభా గణన - 2027’ ప్రక్రియలో కీలక ఘట్టం ప్రారంభమైంది. నేటి నుంచి ఎనిమిది రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాల సేకరణను చేపట్టనున్నారు. జనాభా గణనలో భాగంగా మొదటి దశ అయిన ‘హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ ఆపరేషన్స్’ (HLO) నేటి నుంచి ప్రారంభమవుతోంది. ఇందులో భాగంగా గణన అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి, నివాస గృహాల పరిస్థితి, కుటుంబ సభ్యుల వివరాలు, అందుబాటులో ఉన్న వసతులు మరియు ఆస్తులకు సంబంధించిన మొత్తం 33 ప్రశ్నలను అడిగి సమాధానాలు సేకరిస్తారు.

ఎక్కడెక్కడ ప్రారంభమైంది?

తొలి విడతగా భాగంగా కర్ణాటక, ఒడిశా, గోవా, మిజోరం, సిక్కిం, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, ఢిల్లీలోని ఎన్.డీ.ఎం.సీ (NDMC), ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో జనగణన ప్రారంభమైంది. మొదటిసారిగా ప్రవేశపెట్టిన ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ అంటే ఆన్‌లైన్ ద్వారా సొంతంగా వివరాల నమోదు చేసే సౌకర్యానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. దాదాపు 12 లక్షల కుటుంబాలు ఇప్పటికే అధికారిక పోర్టల్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకున్నాయి. ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసిన వారు, తమకు వచ్చిన SE IDని ఇంటికి వచ్చే అధికారికి చూపిస్తే సరిపోతుంది. మిగిలిన కుటుంబాల వివరాలను అధికారులు నేరుగా ఇంటివద్దే సేకరిస్తారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పటి నుంచి అంటే..

ఆంధ్రప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఆన్‌లైన్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ నేటి నుంచి ఏప్రిల్ 30 వరకు అందుబాటులో ఉంటుంది. ఇక్కడ మే 1 నుంచి మే 30 వరకు ఇంటింటి గణన జరుగుతుంది. ఇక బిహార్‌లో ఏప్రిల్ 17 నుంచి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రారంభమవుతుంది. మే 2 నుంచి ఫీల్డ్ ఆపరేషన్లు మొదలవుతాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పనకు మరియు అభివృద్ధి ప్రణాళికలకు ఈ గణాంకాలు అత్యంత కీలకం కానున్నాయి.

Next Story