Ceasefire: సీజ్‌ఫైర్‌లో అమెరికా ప్రమేయం లేదు.. ట్రంప్‌కు తేల్చి చెప్పిన మోడీ

by B.Srinivas |

భారత్ పాక్ యుద్ధాన్ని నేనే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే.

Ceasefire: సీజ్‌ఫైర్‌లో అమెరికా ప్రమేయం లేదు.. ట్రంప్‌కు తేల్చి చెప్పిన మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ పాక్ యుద్ధాన్ని నేనే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పదే పదే ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కాల్పుల విరమణలో అమెరికా ప్రమేయం ఏమీ లేదని భారత ప్రధాని నరేంద్ర మోడీ ట్రంప్‌నకు తేల్చి చెప్పారు. బుధవారం ట్రంపుతో మోడీ ఫోన్ కాల్‌లో మాట్లాడారు. పాక్ అభ్యర్థన మేరకే ఆపరేషన్ సిందూర్ నిలిపివేశామని స్పష్టం చేశారు. భారత్ ఎప్పుడూ మధ్య వర్తిత్వాన్ని అంగీకరించలేదని, భవిష్యత్ లోనూ దానికి ఒప్పుకోబోదని ట్రంపునకు చెప్పారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో తాను మే 9న అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్‌తో మాత్రమే మాట్లాడానని, యూఎస్ తో చర్చించిన ఏకైక సంభాషణ అదేనని ట్రంప్‌కు స్పష్టం చేశారు. అందులో కూడా తాను వెనక్కి తగ్గలేదని, దృఢంగా ఉన్నానని చెప్పారు. అయితే కెనడా నుంచి క్రొయేషియా వెళ్తున్నప్పుడు అమెరికాలో ఆగాలని ట్రంప్ ఆహ్వానించగా అందుకు మోడీ నిరాకరించినట్టు విదేశాంగ ప్రతినిధి విక్రమ్ మిస్రీ తెలిపారు. అయితే జీ7 సదస్సు సందర్భంగా మోడీ ట్రంప్ మధ్య భేటీ జరగాల్సి ఉంది. అయితే ట్రంప్ ఒకరోజు ముందుగానే సమావేశం నుంచి వెళ్లిపోవడంతో ఫోన్‌లో మాట్లాడారు.

అయితే మోడీతో మాట్లాడిన కాసేపటికే ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. భారత్ పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపింది అమెరికానే అని మరోసారి వ్యాఖ్యానించారు. ‘నేను భారత్ పాక్ యుద్ధాన్ని ఆపాను. ఐ లవ్ పాకిస్థాన్. మోడీ ఒక అద్భుతమైన వ్యక్తి. నిన్న రాత్రి ఆయనతో మాట్లాడా’ అని వ్యాఖ్యానించారు. భారత్ తో త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామని తెలిపారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, భారత ప్రధాని మోడీలో ఎంతో ప్రభావవంతమైన వ్యక్తులని కొనియాడారు.

Next Story