CBSE విద్యార్థులకు కీలక అప్డేట్.. కొత్త పోర్టల్ ప్రారంభతేదీ ఇదే

by Naga Rani Yarlagadda |

సీబీఎస్ఈ విద్యార్థులకు బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. రీవాల్యూయేషన్ కొత్త పోర్టల్ జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించింది.

CBSE విద్యార్థులకు కీలక అప్డేట్.. కొత్త పోర్టల్ ప్రారంభతేదీ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్ : సీబీఎస్ఈ విద్యార్థులకు బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. మార్కుల వెరిఫికేషన్, పేపర్స్ రీ వాల్యుయేషన్ కు సంబంధించి జూన్ 1వ తేదీ నుంచి కొత్తపోర్టల్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. ఇకపై విద్యార్థులకు ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేకుండా.. అత్యంత పారదర్శకంగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకే పోర్టల్ ప్రారంభ తేదీని మార్చుతున్నట్లు బోర్డు ఒక ప్రకటనలో వెల్లడించింది. "పోస్ట్-రిజల్ట్ యాక్టివిటీస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులకు ఎటువంటి అంతరాయం కలగకుండా, పారదర్శకమైన సేవలు అందించడమే మా లక్ష్యం. మూల్యాంకనంలో అత్యున్నత ప్రమాణాలు, నిబంధనలను పాటించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం" అని సీబీఎస్‌ఈ ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో పేర్కొంది.

విద్యార్థుల కోసం హెల్ప్‌లైన్ నంబర్లు

ఈ ప్రక్రియలో ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఎదురైతే విద్యార్థులు సహాయం కోసం టెలీ-కౌన్సెలింగ్ హెల్ప్‌లైన్ 1800 11 8004ను సంప్రదించవచ్చు. లేదా [email protected]కు మెయిల్ పంపవచ్చు. మరోవైపు.. సీబీఎస్‌ఈ క్లాస్ 12 ఫలితాలకు సంబంధించిన 'ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM)' వివాదం, రీ-ఇవాల్యుయేషన్‌పై విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు.

ఈ విషయమై ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తీవ్ర ఒత్తిడిలో ఉన్న విద్యార్థులకు ఉపశమనం కలిగించడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని చెప్పారు. "విద్యార్థుల ఆందోళనలు, వారి సమస్యల పట్ల నాకు పూర్తి సానుభూతి ఉంది. దేశ విద్యాశాఖ మంత్రిగా ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో విద్యార్థులకు తగిన ఉపశమనం, న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత నాపై ఉంది. దీనికి నేనే జవాబుదారీగా ఉంటాను," అని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. అప్‌గ్రేడ్ చేసిన కొత్త పోర్టల్ పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత.. తమ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీలను పొందిన విద్యార్థులు నిర్దిష్ట ప్రశ్నలు, మిస్సయిన పేజీలు లేదా మార్కుల్లో తప్పుల గుర్తింపు వంటి వాటిపై ఆన్‌లైన్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేయవచ్చని మంత్రి పేర్కొన్నారు.

Next Story