సీపీఆర్‌ఐ జాయింట్‌ డైరెక్టర్‌ నివాసంలో నోట్ల కట్టలు! అధికారి ఇంట్లో కోట్లలో అక్రమ నగదు

by Ramesh Naini |

కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెంట్రల్‌ పవర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (CPRI) జాయింట్‌ డైరెక్టర్‌ రాజారాం మోహన్‌రావ్‌ చెన్నును సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) శుక్రవారం అరెస్ట్‌ చేసింది.

సీపీఆర్‌ఐ జాయింట్‌ డైరెక్టర్‌ నివాసంలో నోట్ల కట్టలు! అధికారి ఇంట్లో కోట్లలో అక్రమ నగదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెంట్రల్‌ పవర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (CPRI) జాయింట్‌ డైరెక్టర్‌ రాజారాం మోహన్‌రావ్‌ చెన్నును సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) శుక్రవారం అరెస్ట్‌ చేసింది. రూ.9.5 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ నేపథ్యంలో చర్యలు తీసుకున్నట్లు సీబీఐ వెల్లడించింది. విద్యుత్‌ పరికరాలకు అనుకూల టెస్ట్‌ రిపోర్టులు జారీ చేయడానికి లంచాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలపై చెన్నుతో పాటు సుధీర్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ డైరెక్టర్‌ అతుల్‌ ఖన్నాపై గురువారం సీబీఐ కేసు నమోదు చేసింది. కేసు నమోదు అనంతరం, శుక్రవారం బెంగళూరులో రూ.9.5 లక్షల లంచం లావాదేవీల సమయంలో ఇద్దరినీ అరెస్ట్‌ చేసినట్లు అధికారులు తెలిపారు.

విదేశీ కరెన్సీ..

ఈ క్రమంలో చెన్ను నివాసంలో సోదాలు చేపట్టగా రూ.3.59 కోట్ల లెక్కల్లో లేని నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ పేర్కొంది. అంతేకాకుండా అమెరికన్‌ డాలర్లు, హాంకాంగ్‌ డాలర్లు, సింగపూర్‌ డాలర్లు, ఇండోనేషియన్‌ రూపియా, మలేషియన్‌ రింగిట్‌, యూరోలు, యువాన్‌ (రెన్‌మిన్బీ), స్వీడిష్‌ క్రోనా, యూఏఈ దిర్హామ్‌ తదితర విదేశీ కరెన్సీ విలువ రూ.4,05,858తో పాటు బంగారు ఆభరణాలు, ఇతర కీలక పత్రాలు కూడా లభ్యమైనట్లు తెలిపింది. ఇప్పటివరకు నగదు (విదేశీ కరెన్సీతో కలిపి) మొత్తం రూ.3.76 కోట్ల మేర స్వాధీనం చేసుకున్నామని, సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని సీబీఐ వెల్లడించింది.

సీపీఆర్‌ఐ గురించి..

సెంట్రల్‌ పవర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను భారత ప్రభుత్వం 1960లో స్థాపించింది. 1978లో ఇది విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలో స్వయంప్రతిపత్తి సంస్థగా మారింది. గత ఆరు దశాబ్దాలుగా దేశ విద్యుత్‌ రంగానికి సేవలందిస్తున్న ఈ సంస్థ ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది.

Next Story