Cast survey: కుల గణన విశ్లేషణలో ఫ్రెంచ్ ఆర్థికవేత్త ఎందుకు?.. బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది

by vinod kumar |
Cast survey: కుల గణన విశ్లేషణలో ఫ్రెంచ్ ఆర్థికవేత్త ఎందుకు?.. బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది
X

దిశ, నేషనల్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కులగణన సర్వే డేటాను విశ్లేషించడానికి యమించబడిన నిపుణుల కమిటీలో ఫ్రెంచ్ ఆర్థికవేత్త థామస్ పికెట్టిని (Thomas Piketty) చేర్చడంపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. భారతదేశంలోని సున్నితమైన సామాజిక డేటాను విదేశీయుడికి ఎందుకు అందజేస్తున్నారని రాజ్యసభ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రతినిధి సుధాంషు త్రివేది (Sudhanshu Trivedi) ప్రశ్నించారు. కుల ఆధారిత సర్వేను వివరించడానికి విదేశీ ఆర్థిక నిపుణుడిని నియమించాలనే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తుతుందన్నారు. ‘భారతదేశ సున్నితమైన సామాజిక డేటాను విదేశీయుడికి ఎందుకు అప్పగిస్తున్నారో కాంగ్రెస్ సమాధానం చెప్పాలి. అంతేగాక థామస్ పికెట్టిని ఎందుకు ఎంచుకున్నారో తెలియడం లేదు. ఆయన విధానాలు ధనవంతులపై అధిక పన్ను విధించడాన్ని అనుకూలంగా చెబుతూనే కొన్ని ప్రత్యేక వర్గాలకు మినహాయింపు ఇస్తుంది’ అని తెలిపారు.

దేశంలో ఆర్థిక నిపుణులకు కొరత లేదని, దేశంలోని అనేక మంది ప్రపంచ స్థాయిలో ఉన్నత పదవులను నిర్వహిస్తున్నారని తెలిపారు. విదేశీ సంస్థలతో ఎందుకు నిరంతరం పొత్తు పెట్టుకుంటున్నారో సమాధానం చెప్పలన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దుర్మార్గపు ఎజెండాతో కూడుకున్నదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవిఎల్ నరసింహారావు (Narasimharao) ఆరోపించారు. కాగా, రాష్ట్రంలో కులగణన సందర్భంగా సేకరించిన డేటాను విశ్లేషించడానికి రాష్ట్ర ప్రభుత్వం మార్చి 12న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బీ. సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో 11 మంది సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.

Next Story

Most Viewed