- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Cast census: ప్రతిపక్షాలకు కేంద్రం ఝలక్.. పక్కా స్ట్రాటజీ ప్రకారమే కులగణన తెరపైకి !
సాధారణ జనాభా లెక్కలతో పాటు కుల గణనను సైతం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

దిశ, నేషనల్ బ్యూరో: సాధారణ జనాభా లెక్కలతో పాటు కుల గణనను సైతం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ డిసిషన్ తీసుకుంది. అయితే ఈ నిర్ణయంతో ప్రతిపక్షాలకు షాక్ తగిలినట్టు అయింది. ఎందుకంటే గత కొంత కాలంగా కుల గణన చేపట్టాలని కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ పదే పదే డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ నిరంతరం మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. పలువురు ప్రతిపక్ష నేతలు సైతం ఇదే తరహా డిమాండ్లు చేస్తున్నారు. దీంతో వారందరికీ చెక్ పెట్టేందుకు పక్కా ప్లాన్ ప్రకారమే కేంద్రం తాజా డిసిషన్ తీసుకున్నట్టు పలువురు భావిస్తున్నారు. అంతేగాక బిహార్ ఎన్నికలకు ముందే దీనిని చేపట్టాలని నిర్ణయించడంతో స్ట్రాటజీ ప్రకారమే దీనిని ముందుకు తీసుకొచ్చారని అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్ కు చెక్ పెట్టేందుకేనా?
కాంగ్రెస్ పార్టీ కొంతకాలంగా కుల గణనను డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే కుల గణన చేపట్టింది. దీనికి సంబంధించిన సర్వేలన్నీ పూర్తి చేసింది. ఇదే అంశాన్ని బిహార్ ఎన్నికల్లోనూ ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని దెబ్బకొట్టాలని భావించింది. దీనికి గాను ఆ రాష్ట్రంలో మిత్ర పక్షంగా ఉన్న రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్ సైతం మద్దతిచ్చారు. దీంతో ప్రతిపక్షాలు దీనిని పెద్ద సమస్యగా చూపెట్టడంలో విజయవంతం అయితే అది బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రమాదాన్ని గమనించి కీలక సమయంలో కుల గణన ముందుకు తెచ్చి బిహార్ ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఇరుకున పెట్టినట్టు తెలుస్తోంది.
వారికి క్రెడిట్ దక్కకుండా చర్యలు !
కుల గణన అంశంతో కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రయోజనం పొందకుండా ఉండేందుకు బీజేపీ ఇప్పటికే ప్లాన్ రూపొందించినట్టు కనిపిస్తోంది. కుల గణన ప్రకటన చేయడమే గాక ఈ అంశాన్ని ప్రకటిస్తూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించింది. కుల గణనపై ప్రతిపక్ష పార్టీలు కేవలం రాజకీయాలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ విమర్శించారు. కుల గణన నిర్వహించడం వల్ల సమాజంలోని వాస్తవికత బయటపడుతుందని, అన్ని వర్గాల అభివృద్ధికి తగిన విధానాలను రూపొందించడంలో సహాయపడుతుందని తెలిపారు. ఈ అంశంలో సమాజంలో విభజనను సృష్టించారని, కేంద్రం ప్రకటనతో సానుకూల పరిస్థితులు ఏర్పడతామని చెప్పారు. ఈ ప్రకటనతో తన మార్క్ కనబర్చడానికి కేంద్ర ప్రయత్నించినట్టు అర్థమవుతోంది.
ఓబీసీలపై నజర్
దేశ వ్యాప్తంగా ఉన్న ఓబీసీలను ఆకర్షించేందుకు సైతం మోడీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. సుమారు 52 శాతం ఉన్న ఓబీసీ జనాభాను తమ గుప్పిట్లోకి తీసుకుకోవాలని భావిస్తోంది. అందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది. కుల గణన సర్వేతోనూ వారిని తమవైపు తిప్పుకోవాలని అంచనా వేస్తున్నట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు. బిహార్ లోనూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ జనాభానే అధికంగా ఉంటారు కాబట్టి అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలు రచిస్తున్నట్టు చెబుతున్నారు.






