తొక్కిసలాట ఘటన.. టీవీకే ప్రధాన కార్యదర్శిపై కేసు, పరిహారం ప్రకటించిన విజయ్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-09-28 13:13:41  IST  )

తమిళనాడులోని కరూర్ లో టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్ శనివారం సాయంత్రం నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో తొక్కిసలాట జరిగి 39 మంది మరణించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

తొక్కిసలాట ఘటన.. టీవీకే ప్రధాన కార్యదర్శిపై కేసు, పరిహారం ప్రకటించిన విజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులోని కరూర్ లో టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్ శనివారం సాయంత్రం నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో తొక్కిసలాట జరిగి 39 మంది మరణించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కార్నర్ మీటింగ్ నిర్వహణలో లోపాల కారణంగానే తొక్కిసలాట జరిగినట్లు భావించిన పోలీసులు.. పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సి ఆనంద్ సహా నలుగురిపై కేసు నమోదు చేశారు. TN-PPDL చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు విజయ్ పై కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలన్న డిమాండ్లు రావడంతో.. ఏకసభ్య కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్లు సీఎం ఎంకే స్టాలిన్ తెలిపారు.

మరోవైపు తొక్కిసలాటలో మరణించిన కుటుంబాలకు దళపతి విజయ్ ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఒక్కో ఫ్యామిలీకి రూ.20 లక్షలు చొప్పున పరిహారం అందజేయనున్నట్లు విజయ్ ఎక్స్(X) పోస్టులో తెలిపారు. అలాగే గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారికి ఒక్కొక్కరికి రూ.2 లక్షలు అందించనున్నట్లు చెప్పారు. బాధితులకు టీవీకే ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఏ అవసరం వచ్చినా చూసుకుంటుందని విజయ్ వెల్లడించారు.

నివేదిక కోరిన కేంద్ర హోంశాఖ

కరూర్ తొక్కిసలాట ఘటనపై కేంద్ర హోంశాఖ ఆరా తీసింది. తమిళనాడు సీఎం స్టాలిన్, గవర్నర్లకు హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఘటన జరిగిన తీరుపై ఆరా తీసిన ఆయన.. తొక్కిసలాటపై ప్రభుత్వం నుంచి నివేదిక తయారు చేసి కేంద్రానికి పంపాలని ఆదేశించారు.

Next Story