- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎడ్యుకేషన్ పాలసీ మతతత్వాన్ని పెంచుతోంది
బీజేపీ ప్రభుత్వం ఈ నూతన పాలసీ ద్వారా చెప్తున్న లక్ష్యాలు వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయని అన్నారు.

- మోడీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలహీనపరుస్తోంది
- కేంద్రీకరణ, వాణిజ్యీకరణ, మతతత్వాన్ని అనుసరిస్తోంది
- కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ విమర్శలు
దిశ, నేషనల్ బ్యూరో: 'కేంద్రీకరణ, వాణిజ్యీకరణ, మతతత్వీకరణ'ను ముందుకు తీసుకెళ్లడానికే కేంద్రం నూతన విద్యా విధానాన్ని (ఎన్‌ఈపీ) ఉపయోగిస్తోందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ సోనియా గాంధీ అన్నారు. ది హిందూ దినపత్రిక కోసం 'ది త్రీ సీస్ దట్ హాంట్ ఇండియన్ ఎడ్యుకేషన్ టుడే' పేరుతో రాసిన ఆర్టికల్‌లో కేంద్ర ప్రభుత్వ విధానాన్ని బలమైన పదజాలంతో తప్పబట్టారు. ఎన్ఈపీ పేరుతో బీజేపీ ప్రభుత్వం భారీ కుట్రకు తెరలేపిందని, పూర్తి స్థాయిలో సంప్రదింపులు జరపకుండా రాజకీయ స్వలాభం కోసం విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని సోనియా గాంధీ విమర్శించారు. ఎన్‌ఈపీ అమలులో కీలక నిర్ణయాల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలను మినహాయించింది. విద్యా విధానాల్లో గణనీయమైన మార్పులు ఉన్నప్పటికీ.. కేంద్ర, రాష్ట్ర విద్యా మంత్రులతో కూడిన సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ 2019 సెప్టెంబర్ నుంచి సమావేశం కాలేదన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
విద్యా హక్కు చట్టానికి మద్దతు ఇచ్చే సమగ్ర శిక్షా అభియాన్ గ్రాంట్లను నిలిపివేయడం ద్వారా కేంద్రం ఆర్థిక ఒత్తిడిని ఉపయోగించి పీఎం-ఎస్‌హెచ్‌ఆర్ఐ పథకాన్ని అమలు చేయాలని బలవంతం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం విద్యా హక్కును సమర్థించడం కంటే ప్రచారంపైనే ఆసక్తి చూపుతుందని ఆరోపించారు. ఎస్ఎస్ఏ నిధులను రాష్ట్రాలకు బేషరతుగా విడుదల చేయాలని పార్లమెంట్ స్టాండింగ్కమిటీ 363వ నివేదికను ఆమె ప్రస్తావించారు. కొత్త విద్యా విధానం వెనుక బీజేపీ ఎజెండా ఉందని ఆరోపించారు. విద్యా కాషాయీకరణ, కేంద్రీకరణ, వాణిజ్యీకరనే ముఖ్య ఉద్దేశమని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం ఈ నూతన పాలసీ ద్వారా చెప్తున్న లక్ష్యాలు వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాయని అన్నారు.
దేశంలో ఉన్న పిల్లలు, యువకులకు విజ్ఞానంతో నిండిన విద్యను అందించకుండా.. మత భావాలను ఎక్కించడమే లక్ష్యంగా ఈ విధానాన్ని తీసుకొని వస్తున్ారని మండిపడ్డారు. గత పదేళ్లుగా వాళ్లు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను బట్టి ఈ విషయాలను అర్థం చేసుకోవచ్చని అన్నారు. మోడీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలహీనపరుస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం విద్యను మతతత్వంగా మారుస్తోందని.. అది మతతత్వం, ద్వేషం వంటి సైద్ధాంతిక ఎజెండాను అనుసరిస్తుందని సోనియా గాంధీ ఆరోపించారు. ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల నుంచి కీలకమైన విషయాలను తొలగించడాన్ని.. ప్రజల ఒత్తిడి వచ్చే వరకు రాజ్యాంగ పీఠికను తాత్కాలికంగా మినహాయించడాన్ని కూడా సోనియా గాంధీ విమర్శించారు. కొత్త విద్యా విధానం ద్వారా అధికార కేంద్రీకరణ జరుగుతుందని.. అంతే కాకుండా ప్రైవేట్ ఔట్ సోర్సింగ్ ద్వారా వ్యాపారీకరణ, టెక్ట్స్ బుక్స్, విద్యా సంస్థల కాషాయీకరణ అవుతుందని సోనియా అన్నారు.
కాంగ్రెస్‌ది అవకాశం వాదం : సీఆర్ కేశవన్
కాంగ్రెస్ పార్టీది రాజకీయ అవకాశవాదమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ అన్నారు. యూపీఏ కాలంలో అస్థిరమైన, గందరగోళ విద్యా సంస్కరణలు ఉన్నాయని గుర్తు చేశారు. పదవ తరగతి బోర్డు పరీక్షల డీలింకింగ్ విధాన్నాన్ని రద్దు చేశారని చెప్పారు. భారతీయర విద్యను ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా మార్చడంతోపాటు.. భాషా, సాంస్కృతిక వైవిధ్యాన్ని గౌరవించడమే ఎన్ఈపీ లక్ష్యమని అన్నారు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన సమగ్ర విధానంగా ఎన్ఈపీని కేశవన్ అభివర్ణించారు. విద్యార్థుల సమకాలీన నైపుణ్యాలను పెంపొందించడంతోపాటు.. మాతృ భాషలో అభ్యాసాన్ని ప్రోత్సహిస్తుందని చెప్పారు. దేశ విద్యా వారసత్వాన్ని కాపాడుతూ, విద్యా సంస్థల్లో స్వయం ప్రతిపత్తిని ప్రోత్సహిస్తుందని చెప్పారు.






