Canada: కెనడాలో భారతీయుడి దారుణ హత్య.. వెల్లడించిన ఇండియన్ ఎంబసీ

by B.Srinivas |

కెనడాలో ఓ భారత పౌరుడిని కత్తితో పొడిచి చంపినట్టు భారత రాయబార కార్యాలయం శనివారం వెల్లడించింది.

Canada: కెనడాలో భారతీయుడి దారుణ హత్య.. వెల్లడించిన ఇండియన్ ఎంబసీ
X

దిశ, నేషనల్ బ్యూరో: కెనడా (Canada)లో భారతీయుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆ దేశ రాజధాని ఒట్టావా (Ottavaa) నగరానికి సమీపంలో ఓ భారత పౌరుడిని కత్తితో పొడిచి చంపినట్టు భారత రాయబార కార్యాలయం శనివారం వెల్లడించింది. ఓ అనుమానిత నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపింది. ‘ర్యాక్ లాండ్‌ (Ryak land)లో జరిగిన కత్తిపోటు ఘటనలో ఓ భారతీయ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన మాకు ఎంతో బాధ కలిగించింది. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా సాయం అందిస్తున్నాం. స్థానిక కమ్యునిటీ సభ్యులతో టచ్‌లో ఉన్నాం. హత్యతో ప్రమేయం ఉన్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు’ అని ఇండియన్ ఎంబసీ (Indian Embassy) తన ప్రకటనలో పేర్కొంది.

అయితే మృతుడి పేరు, ఇతర వివరాలను వెల్లడించలేదు. మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తిపై ఎలాంటి అభియోగాలు మోపారో పోలీసులు తెలియజేయలేదు. అయితే ప్రజల భద్రతకు ఎటువంటి ఆందోళనలు లేవని అంటారియో ప్రావిన్షియల్ పోలీసులు తెలిపారు. దర్యాప్తు ప్రారంభ దశలో ఉందని, మరిన్ని వివరాలు తెలియజేయమని పేర్కొన్నారు. కత్తిపోటు సంఘటన జరిగినప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

Next Story