దెయ్యం, పిశాచి అని భార్యను పిలిస్తే క్రూరత్వమా ? కీలక తీర్పు

by Dishanational4 |
దెయ్యం, పిశాచి అని భార్యను పిలిస్తే క్రూరత్వమా ? కీలక తీర్పు
X

దిశ, నేషనల్ బ్యూరో : కొందరు భర్తలు తమ భార్యలను అప్పుడప్పుడు దెయ్యం, భూతం, పిశాచం అని పిలుస్తుంటారు. కొంతమంది సీరియస్‌గా.. ఇంకొంతమంది ఫన్నీగా ఇలాంటి పదాలను భార్యలపై సందర్భాన్ని బట్టి ప్రయోగిస్తుంటారు. అయితే ఇలా భర్త పిలిచినందుకు ఓ మహిళ కోర్టుకెక్కింది. వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్‌లోని బొకారోకు చెందిన నరేష్ కుమార్‌కు, బిహార్‌లోని నవాడా పట్టణానికి చెందిన మహిళతో 20 ఏళ్ల క్రితం పెళ్లయింది. మనస్పర్థల కారణంగా వీరు 2018లోనే విడాకులు తీసుకున్నారు. ‘‘గతంలో నన్ను అత్తమామ వేధించేవారు. దెయ్యం, భూతం, పిశాచమని భర్త తిట్టేవాడు’’ అంటూ విడాకులయ్యాక నరేష్ భార్య బిహార్‌లోని నలంద జిల్లా కోర్టులో పిటిషన్ వేసింది. దీంతో నరేష్, అతడి తండ్రికి కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం ఐపీసీలోని సెక్షన్ 498ఏ కింద నరేష్, అతడి తండ్రికి సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించింది. వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం మరో 6 నెలల కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా విధించింది.ఈ తీర్పును సవాల్ చేస్తూ నరేష్ గుప్తా పాట్నా హైకోర్టును ఆశ్రయించాడు. దీన్ని పరిశీలించిన హైకోర్టు.. భార్యపై భర్త భూతం, దెయ్యం, పిశాచం లాంటి పదాలను ప్రయోగించడం క్రూరత్వంతో సమానం కాదని స్పష్టం చేసింది. ఇలాంటి విషయాల్లో నిందితులపై ఐపీసీలోని సెక్షన్ 498ఏను ప్రయోగించడం కుదరదని తేల్చి చెప్పింది. నరేష్, అతడి తండ్రికి జైలుశిక్ష విధిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును న్యాయస్థానం కొట్టేసింది.


Next Story