గాల్లోనే నిలిచిపోయిన కేబుల్ కార్.. 300 మంది ప్రయాణికుల ఆందోళన.. రంగంలోకి ఆర్మీ!

by Ramesh Naini |

జమ్మూ కాశ్మీర్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన గుల్మార్గ్‌లో సోమవారం గొండోలా (కేబుల్ కార్) సేవల్లో ఊహించని సాంకేతిక లోపం తలెత్తింది.

గాల్లోనే నిలిచిపోయిన కేబుల్ కార్.. 300 మంది ప్రయాణికుల ఆందోళన.. రంగంలోకి ఆర్మీ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: జమ్మూ కాశ్మీర్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన గుల్మార్గ్‌లో సోమవారం గొండోలా (కేబుల్ కార్) సేవల్లో ఊహించని సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కేబుల్ కార్లు ఒక్కసారిగా గాల్లోనే ఆగిపోవడంతో, సుమారు 300 మంది పర్యాటకులు అందులో చిక్కుకుపోయారు. మధ్యలోనే కేబుల్ కార్లు నిలిచిపోవడంతో అందులోని మహిళలు, చిన్నారులు సహా పర్యాటకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే భారత ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, స్థానిక రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు, సాంకేతిక నిపుణులు లోపాన్ని గుర్తించి సేవలను పునరుద్ధరించే పనిలో నిమగ్నమయ్యారు.

పరిస్థితి అదుపులోనే ఉంది: సీఎం కార్యాలయం

ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కార్యాలయం స్పందించింది. ‘ప్రభుత్వం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. కేబుల్ కార్లు అన్నీ సురక్షితంగానే ఉన్నాయి. శిక్షణ పొందిన బృందాలతో పర్యాటకులను సురక్షితంగా కిందకు దించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉంది, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని అధికారులు స్పష్టం చేశారు. కాగా, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కేబుల్ కార్ ప్రాజెక్టులలో ఒకటైన ఈ గుల్మార్గ్ గొండోలాకు వేసవిలో పర్యాటకుల రద్దీ భారీగా ఉంటుంది. ప్రస్తుతానికి అధికారుల సత్వర స్పందనతో పెను ప్రమాదం తప్పినట్లయింది.

Next Story