- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో EWS ఫీజుల భారం.. పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో భారీ ఫీజులను ఈడబ్ల్యూఎస్ (EWS) అభ్యర్థులు భరించలేకపోతున్నారంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని భారీ ఫీజులను ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) అభ్యర్థులు భరించలేకపోతున్నారంటూ, వారి ఫీజులను నియంత్రణ, రాయితీలపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) తిరస్కరించింది. ప్రైవేట్ వైద్య విద్యా సంస్థల్లోని ఫీజుల నిర్మాణంలో కోర్టులు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేస్తూ ధర్మాసనం పిటిషన్‌ను తోసిపుచ్చింది. విచారణ సందర్భంగా ధర్మాసనం పిటిషన్‌ను పరిశీలించిన అనంతరం.. ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ప్రైవేట్ కాలేజీల నిర్వహణ, వాటి మౌలిక వసతులు, ఫీజుల నిర్ధారణ అనేవి ఆయా యాజమాన్యాలు, సంబంధిత రాష్ట్రాల ఫీజు నియంత్రణ కమిటీల పరిధిలోకి వస్తాయని కోర్టు అభిప్రాయపడింది. ఓ అర్హత కలిగిన అభ్యర్థి ప్రైవేట్ సంస్థలో సీటు పొందినప్పుడు అక్కడి నిబంధనలకు కట్టుబడి ఉండాలని, ఫీజులు చెల్లించలేని పక్షంలో ప్రభుత్వ పథకాలు, స్టడీ లోన్లను ఆశ్రయించాలే తప్ప కోర్టుల ద్వారా ఫీజులను తగ్గించలేమని పేర్కొంటూ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో ప్రైవేటు కాలేజీల్లో సీట్లు సాధించిన పేద, మధ్యతరగతి EWS విద్యార్థులకు ఎదురుదెబ్బ తగిలినట్లైంది.
కాగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (EWS) కేటాయించిన 10 శాతం రిజర్వేషన్ల ద్వారా ప్రభుత్వ కాలేజీలతో పాటు కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోనూ విద్యార్థులకు ఎంబీబీఎస్ (MBBS) సీట్లు లభిస్తున్నాయి. అయితే, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఫీజులు లక్షల్లో, కొన్ని చోట్ల రూ.కోట్లలో నడుస్తున్నాయి. దీంతో ఆర్థికంగా వెనుకబడిన ఓ అభ్యర్థి మెరిట్ సాధించి ప్రైవేట్ కాలేజీలో ఈడబ్ల్యూఎస్ కోటా కింద సీటు పొందినా.. అక్కడి భారీ ఫీజులను చెల్లించే స్తోమత ఆ కుటుంబానికి ఉండదని, ఫీజులు కట్టలేక ఎంతోమంది తమ సీట్లను వదులుకోవాల్సి వస్తోందని పిటిషనర్లు పేర్కొన్నారు. కాబట్టి ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని EWS అభ్యర్థుల ఫీజులను తగ్గించి, ప్రభుత్వం భరించేలా ఆదేశాలు ఇవ్వాలి పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం వారి పిటిషన్‌ను కొట్టివేసింది.






