- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లో దుస్తులు.. హెయిర్ ఆయిల్ టాస్క్.. BSNL డైరెక్టర్ టూర్ షెడ్యూల్‍పై కేంద్రం సీరియస్
తన వ్యక్తిగత పర్యటనలో 21 పనుల కోసం 50 మంది సిబ్బందిని కేటాయించాలంటూ బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ పెట్టిన డిమాండ్లపై కేంద్రం సీరియస్ అయింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తన వ్యక్తిగత పర్యటన కోసం బీఎస్ఎన్ఎల్ లోని ఉన్నత స్థాయి అధికారి పెట్టిన డిమాండ్లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సదరు అధికారిపై సీరియస్ అయింది. ఇలాంటి ప్రవర్తన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని వెంటనే అతడికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సదరు అధికారి ఇచ్చిన వివరణ ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు.
ఇంతకీ ఏం జరిగింది?:
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ సీనియర్ డైరెక్టర్ వివేక్ బంజల్ ఈ నెల 25-26 తేదీలలో యూపీలోని ప్రయాగ్ రాజ్ ను తన కుటుంబంతో సందర్శించాలని ప్లాన్ చేసుకున్నారు. వెంటనే తన టూర్‍కు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎవరైనా పై అధికారి వస్తే కింది స్థాయి సిబ్బంది ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోవడం కామనే. కానీ ఇక్కడ వివేక్ బంజల్ టూర్ షెడ్యూల్ లో ఆయన పెట్టిన డిమాండ్లు శృతిమించిపోవడం అందరికి ఆగ్రహం తెప్పించాయి. తన పర్యటన సమయంలో 21 పనులు చేసేందుకు 50 మంది బీఎస్‌ఎన్‌ఎల్ సిబ్బందిని కేటాయించాలని డిప్యూటీ మేనేజర్ లెవెల్ ఆఫీస్ నుంచి ఆదేశాలు వచ్చాయి. అంతే కాదు అడుగు తీసి అడుగు పెట్టే వరకు ప్రతిదీ వేరీ వెరీ స్పెషల్ ట్రీట్ మెంట్ ఉండేలా ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారు చేయడం అది కాస్త సోషల్ మీడియాలో లీక్ కావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
లోదుస్తులు, హెయిర్ ఆయిల్...
తన పర్యటన సందర్భంగా సిబ్బంది రైల్వేస్టేషన్‌లో వివేక్ బంజల్ దిగగానే స్వాగతం పలకాలి. ఆలయ సందర్శనలు, బోట్ రైడ్స్‌ను సమన్వయం చేసుకోవాలి. టవల్స్, అండర్‌గార్మెంట్లు, నూనె, దువ్వెన వంటి వాటితో ‘స్నాన్’ కిట్స్ సిద్ధం చేయాలని షెడ్యూల్ లో పేర్కొన్నారు. అలాగే మతపరమైన కార్యకలాపాల కోసం రవాణా సౌకర్యాలు చూసుకోవడంతో పాటు ఫొటోలు తీయించడం తాను ప్రయాణించే వాహనాల్లో వాటర్ బాటిల్స్, చాక్లెట్లు, స్నాక్స్ ఉండేలా చూడాలని పేర్కొంటూ ఫిబ్రవరి 19న ఆదేశాలు వచ్చాయి. అసలే బీఎస్ఎన్ఎల్ పనితీరుపై పీకల్లోతు కోపంతో రగిలిపోయే మన నెటిజన్లు ఈ షెడ్యూల్ చూశాక కోపంతో రెచ్చిపోయారు. ఏందీ రాజభోగం అంటూ నెటిజన్లు ఏకిపారేశారు. తీవ్ర వ్యతిరేకత రావడంతో వివేక్ బంజల్ తన పర్యటనలు రద్దు చేసుకున్నారు.
ఏడు రోజుల గడువు:
ఇది వనరుల దుర్వినియోగమేనంటూ నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ వ్యవహారంపై ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని వివేక్ బంజల్ ను ఆదేశించింది. ఇది ప్రవర్తన నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సీరియస్ అయ్యారు. ఈ పరిణామాలన్ని గమనిస్తున్న నెటిజన్లు ఇంత అతి అవసరమా? అంటూ దుయ్యబడుతున్నారు.






