విమానం గాల్లో ఉండగా ప్రసవం

by Ajay Maddhiboyina |

ఆ పాపకు ఫాంటా అని పేరు పెట్టారు. బేబీ ఫాంటాను చేతుల్లోకి తీసుకున్న క్షణం తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని చెప్పింది.

విమానం గాల్లో ఉండగా ప్రసవం
X

- సహాయం చేసిన ఎయిర్ హోస్టెస్, ప్రయాణికులు

- పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ప్రయాణికురాలు

- బేబీ ఫాంటాగా నామకరణం

దిశ, నేషనల్ బ్యూరో: డాకర్ నుంచి బ్రస్సెల్స్‌కు వెళ్తున్న విమానంలో ప్రయాణికురాలు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. విమానం గాల్లో ఉండగానే ప్రయాణికురాలికి నొప్పులు మొదలయ్యాయి. అయితే వెంటనే ల్యాండ్ చేసే అవకాశం లేకపోవడంతో ఎయిర్ హోస్టెస్, ఇద్దరు ప్రయాణికులు ఆమెకు సాయం చేశారు. ఇద్దరు ప్రయాణికులు కూడా వైద్య నిపుణులు కావడంతో బిడ్డను ప్రసవించడానికి సాయం చేశారు. ఈ విషయాన్ని బ్రస్సెల్స్ ఎయిర్‌లైన్స్ సామాజిక మాధ్యమంలో పంచుకుంది. టేకాఫ్ అయిన వెంటనే విమాన ప్రయాణికురాలు తీవ్రమైన నొప్పికి గురైంది. విషయాన్ని ఎయిర్ హోస్టెస్‌ జెన్నిఫర్‌కు చెప్పడంతో అదే విమానంలో ఉన్న ఒక నర్స్ ఈ నొప్పులను తగ్గించడానికి ప్రయత్నించింది. అయితే కొద్ది సేపటికే భారీగా ఉమ్మనీరు వస్తుండటంతో సమయం వృధా చేయకుండా పైలెట్లకు విషయం తెలిపారు. వారు డాకర్‌కు తిరిగి వెళ్లడానికి విమానాన్ని వెనక్కు తిప్పారు. కానీ నొప్పులు తీవ్రతరం కావడంతో ల్యాండ్ అయ్యే లోపే ఎయిర్ హోస్టెస్, ఇద్దరు ప్రయాణికుల సాయంతో ప్రసవం చేశారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. క్యాబిన్ క్రూ సభ్యరాలిగా మేం ప్రతీ విషయానికి శిక్షణ పొందుతాము. ప్రసవానికి కూడా ఏం చేయాలో చెప్తారు. కానీ నిజమైన సంఘటనలు ఎదురైనప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. మేం జట్టుగా ఉండి పని చేశాము. నేను క్యాబిన్ క్రూ సభ్యురాలిని కాకపోయి ఉంటే.. మంత్రసానిని అయ్యేదాన్నేమో అంటూ జెన్నిఫర్ తన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో రాసుకొచ్చింది. కాగా, ఆ పాపకు ఫాంటా అని పేరు పెట్టారు. బేబీ ఫాంటాను చేతుల్లోకి తీసుకున్న క్షణం తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని చెప్పింది.

Next Story