Ukraine: కీవ్ కు సాయం చేసేందుకు ముందకొచ్చిన బ్రిటన్

by Shamantha N |

ఉక్రెయిన్- రష్యా మధ్య ఉద్రిక్తలు తీవ్ర తరమయ్యాయి. ఇలాంటి పరిణామాల వేళ కీవ్ కు డ్రోన్లను సరఫరా చేసేందుకు బ్రిటన్ ముందుకు వచ్చింది.

Ukraine: కీవ్ కు సాయం చేసేందుకు ముందకొచ్చిన బ్రిటన్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్- రష్యా మధ్య ఉద్రిక్తలు తీవ్ర తరమయ్యాయి. ఇలాంటి పరిణామాల వేళ కీవ్ కు డ్రోన్లను సరఫరా చేసేందుకు బ్రిటన్ ముందుకు వచ్చింది. 2026 ఏప్రిల్ నాటికి ఉక్రెయిన్‌కు లక్ష డ్రోన్లు అందజేస్తామని హామీ ఇచ్చింది. ఉక్రెయిన్ కు 4.5 బిలియన్‌ పౌండ్ల మిలిటరీ మద్దతు ఇస్తామని గతంలోనే బ్రిటన్ ప్రకటించింది. అందులో భాగమే ఈ 350 మిలియన్‌ పౌండ్ల డ్రోన్‌ ప్యాకేజీ భాగమని పేర్కొంది. స్వతంత్రంగా ఉత్పత్తి చేసిన స్ట్రాటజిక్ డిఫెన్స్ రివ్యూను బ్రిటన్ ప్రభుత్వం ఆమోదించింది. రష్యన్‌ దురాక్రమణతో సహా ఇతర ముప్పులను ఎదుర్కోవడానికి కీవ్‌కు మిలిటరీ మద్దతు ఇస్తున్నట్లు బ్రిటన్ తెలిపింది. బ్రస్సెల్స్‌లో నిర్వహించనున్న 50 దేశాల ఉక్రెయిన్ డిఫెన్స్ కాంటాక్ట్ గ్రూప్ సమావేశంలో బ్రిటన్‌ రక్షణ కార్యదర్శి జాన్ హీలీ ఈ ప్రకటన చేయనున్నారు.

రష్యా వైమానిక స్థావరాలే లక్ష్యంగా

ఇటీవలే రష్యాలోని వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఉక్రెయిన్‌ భారీగా డ్రోన్‌ దాడులకు (Ukraine-Russia) పాల్పడడంతో మాస్కోకు చెందిన 41 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. అయితే, ఈ సమయంలో కీవ్‌కు భారీ సంఖ్యలో డ్రోన్‌లను సరఫరా చేసేందుకు బ్రిటన్ రెడీ అవ్వడం గమనార్హం. మరోవైపు, రష్యా వద్ద భారీగా క్షిపణి సంపద ఉంది. ఆ దేశంతో పోలిస్తే ఉక్రెయిన్‌ దగ్గర భారీ ఆయుధాలు లేకపోవడం కీవ్‌కు సమస్యగా మారింది. ముఖ్యంగా గగనతల రక్షణ వ్యవస్థ లేకపోవడంతో రష్యా చేసే క్షిపణులు, డ్రోన్ల దాడులను తట్టుకోలేకపోతోంది. దీంతో రిమోట్‌ సాయంతో సుదీర్ఘంగా ప్రయాణించగలిగే డ్రోన్ల వ్యవస్థను అభివృద్ధి చేసుకుంది. వీటితోనే రష్యాలోని అనేక ప్రాంతాల్లో భారీ దాడులకు పాల్పడింది. గతంలోనూ రష్యా సైనిక స్థావరాలు, చమురు బావులపై దాడులు చేసేందుకు ఉక్రెయిన్‌ వీటిని ప్రయోగించింది. భవిష్యత్తులో రష్యా ఆక్రమణలను ఎదుర్కోవడానికి మరిన్ని డ్రోన్లు సరఫరా చేయాలని మిత్ర దేశాలను కోరింది.

Next Story