ఎయిరిండియా విమాన ప్రమాదం వీడియో.. సాక్షిగా మైనర్

by Naga Rani Yarlagadda |

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా షాక్‌కు గురిచేసింది. ఈ దుర్ఘటనకు సంబంధించిన ఒక వీడియో కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో విమానం టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే క్రమంగా కిందకు దిగుతూ కూలిపోయిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి.

ఎయిరిండియా విమాన ప్రమాదం వీడియో.. సాక్షిగా మైనర్
X

దిశ, వెబ్‌డెస్క్: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా షాక్‌కు గురిచేసింది. ఈ దుర్ఘటనకు సంబంధించిన ఒక వీడియో కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో విమానం టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే క్రమంగా కిందకు దిగుతూ కూలిపోయిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ఈ వీడియోను స్థానికంగా నివసించే 17 ఏళ్ల బాలుడు ఆర్యన్‌ చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న అహ్మదాబాద్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులు ఆ బాలుడి వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు వెల్లడించారు.

ఎయిర్‌పోర్టు సమీపంలో అద్దె ఇంట్లో నివసిస్తున్న ఆర్యన్‌కు విమానాలు టేకాఫ్‌ అవుతున్న దృశ్యాలను వీడియో తీయడం అలవాటు. జూన్‌ 12న అలాంటి వీడియో తీస్తుండగా, ఊహించని విధంగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. "వీడియో రికార్డింగ్‌ మొదలెట్టిన 14 సెకన్లలోనే విమానం కూలిపోయింది. ఆ దృశ్యాన్ని స్వయంగా చూసి చాలా భయపడ్డాను. ఈ వీడియోను మొదట నా సోదరి చూసి, తర్వాత నాన్నకు చెప్పింది. విమానం కూలిపోతుందని నేను అస్సలు ఊహించలేదు," అని ఆర్యన్‌ మీడియాతో చెప్పాడు. ఈ ఘటన ఆర్యన్‌ను తీవ్రంగా కలచివేసిందని, ఆ రాత్రంతా నిద్రపోకుండా, ఏమీ తినకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాడని అతడి సోదరి, ఇంటి యజమాని వెల్లడించారు. ఈ సంఘటన తర్వాత ఇక్కడ ఉండలేనని ఆర్యన్‌ భావించాడని, భయంతో సరిగ్గా మాట్లాడలేకపోయాడని వారు తెలిపారు.

అయితే, ఈ వీడియో తీసిన బాలుడిని అరెస్టు చేసినట్లు వచ్చిన వార్తలను పోలీసులు ఖండించారు. ఆర్యన్‌ తన తండ్రితో కలిసి వచ్చి సాక్షిగా వాంగ్మూలం ఇచ్చాడని, వీడియో చిత్రీకరణకు సంబంధించిన వివరాలను అందించాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత అతడు తన తండ్రితో కలిసి వెళ్లిపోయాడని, ఎలాంటి అరెస్టులు జరగలేదని స్పష్టం చేశారు.

Next Story