Delhi Car Blast : ఢిల్లీ బ్లాస్ట్‌లో కీలక పరిణామం.. పేలుడు జరిగిన కారు రిజిస్ట్రేషన్ నెంబర్ గుర్తింపు

by Ramesh Naini |

దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో ఇవాళ (సోమవారం) ఎర్రకోట మెట్రోస్టేషన్‌ పార్కింగ్‌ వద్ద కారులో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే.

Delhi Car Blast : ఢిల్లీ బ్లాస్ట్‌లో కీలక పరిణామం.. పేలుడు జరిగిన కారు రిజిస్ట్రేషన్ నెంబర్ గుర్తింపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో ఇవాళ (సోమవారం) ఎర్రకోట మెట్రోస్టేషన్‌ పార్కింగ్‌ వద్ద కారులో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ పేలుడు కారణంగా ఇప్పటివరకు దాదాపు 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరోవైపు 30 మందికి పైగా గాయపడి ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పేలుడు జరిగిన ఐ 20 కారు రిజిస్ట్రేషన్ నెంబర్ HR267674గా గుర్తించబడింది. ప్రాథమిక విచారణలో ఆ కారు హర్యానాకు చెందినదని, అది నదీమ్‌ ఖాన్ అనే వ్యక్తి పేరుపై రిజిస్ట్రేషన్ అయిందని పోలీసులు వెల్లడించారు. ఘటన అనంతరం ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించగా, భద్రతా బలగాలు ముఖ్య ప్రాంతాల్లో మోహరించాయి.

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఐబీ చీఫ్‌, ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌తో మాట్లాడి దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు. పేలుడు స్థలాన్ని పరిశీలించిన అనంతరం, ఎన్‌ఐఏ, ఎన్‌ఎస్‌జీ బృందాలను దర్యాప్తులోకి దింపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, పేలుడుకు అమ్మోనియం నైట్రేట్‌ ఉపయోగించి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్ర కోణంలో విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా భద్రతా సన్నాహాలు మరింత కట్టుదిట్టం చేశారు.

Next Story