Rahul Gandhi: బీజేపీది యాంటీ దళిత్ మెంటాలిటీ- రాహుల్ గాంధీ

by Shamantha N |

బీజేపీది యాంటీ దళిత్ మెంటాలిటీ అని ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) విమర్శలు గుప్పించారు.

Rahul Gandhi: బీజేపీది యాంటీ దళిత్ మెంటాలిటీ- రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీది యాంటీ దళిత్ మెంటాలిటీ అని ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దళితుల హక్కులను కాలరాజేస్తుందని నిప్పులు చెరిగారు. జాతీయ ఎస్సీ క‌మీష‌న్‌లో ఉన్న ఖాళీ పోస్టుల‌ను భ‌ర్తీ చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ లో రాహుల్ సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఎస్సీ కమిషన్ లో పోస్టులు భర్తీ చేయడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. దళితుల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. " బీజేపీ ప్రభుత్వ దళిత వ్యతిరేక మనస్తత్వానికి మరో రుజువు ఇదే! దళితుల హక్కులను పరిరక్షించే షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్‌ను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేశారు. అందులోని రెండు కీలక పదవులు గత సంవత్సరం నుండి ఖాళీగా ఉన్నాయి" రాహుల్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

రాజ్యాంగంపైన దాడి..

ఎస్సీ క‌మీష‌న్ అనేది ఓ రాజ్యాంగ సంస్థ అని, దాన్ని బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డం అంటే, రాజ్యాంగంపై దాడి చేయ‌డ‌మే అని రాహుల్ చెప్పుకొచ్చారు. అలా చేయడం ద‌ళితుల సామాజిక హ‌క్కుల్ని కాల‌రాసిన‌ట్లు అవుతుంద‌ని మండిపడ్డారు. ఎస్సీ కమిషన్ కాకపోతే, దళితుల గొంతుకలను ఎవరు వింటారు? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఎస్సీ క‌మిష‌న్‌లో వ్య‌క్తులు లేకుంటే, దళితులు ఇచ్చే ఫిర్యాదుల‌పై ఎవ‌రు చ‌ర్య‌లు తీసుకుంటార‌ని అడిగారు. ఎస్సీ క‌మీష‌న్‌లో త‌క్ష‌ణ‌మే పోస్టుల‌ను భ‌ర్తీ చేయాల‌ని, అప్పుడే ఆ సంస్థ స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తుంద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం ఎస్సీ క‌మిష‌న్ అధిప‌తిగా కిషోర్ మ‌క్వానా ఉన్నారు. దాంట్లో వైస్ చైర్మెన్‌, ఓ స‌భ్యుడి పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Next Story