- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kejriwal: గెలిస్తే మురికివాడలను కూల్చివేస్తుంది- బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi Assembly polls) బీజేపీ(BJP) గెలిస్తే.. మురికివాడలను కూల్చివేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఆరోపించారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi Assembly polls) బీజేపీ(BJP) గెలిస్తే.. మురికివాడలను కూల్చివేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఆరోపించారు. ఢిల్లీలోని షకుర్‌బస్తీ ప్రాంతంలోని మురికివాడను సందర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. కాషాయ పార్టీపై విరుచుకుపడ్డారు. ఐదేళ్లుగా మురికివాడల్లోని(Delhi slums) ప్రజల వద్దకు బీజేపీ వెళ్లలేదన్నారు. కానీ, ప్రస్తుతం వారి చుట్టూనే తిరుగుతోందని ఆరోపించారు. ఎన్నికల్లో వారి ఓట్లు పొందేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందన్నారు. ఒకవేళ.. ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఢిల్లీలోని అన్ని మురికివాడలను కూల్చి వేస్తుందని చెప్పుకొచ్చారు. స్లమ్ ఏరియా ప్రజలపై ఎలాంటి ప్రేమ లేదని కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. ‘‘బీజేపీ ధనవంతుల పార్టీ. అలాంటి నేతలు మురికివాడల్లోని ప్రజల గురించి ఎందుకు పట్టించుకుంటారు..? వారిని పురుగులకన్నా హీనంగా చూస్తుంటారు. ఎన్నికల వేళ.. వారి ఓట్లను అడుక్కుంటారు. ఎన్నికల తర్వాత వారి భూములను లాగేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇటీవలే కేంద్రమంత్రి అమిత్ షా మురికివాడల్లోని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అదే సమయంలో ఆయన నన్ను ఉద్దేశిస్తూ వాడిన పదజాలం అభ్యంతరకరంగా ఉంది. ఆయన నన్ను ధూషించిన పదాలు విన్న ఏ నాగరిక వ్యక్తి అయినా వాటిని వినేందుకు సిగ్గు పడతాడు. ఆయనతో నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. నేను నా గౌరవం కోసం ఆలోచించను. దేశప్రజల ప్రయోజనాల కోసమే రాజకీయాల్లోకి వచ్చాను’’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
20 అసెంబ్లీ స్థానాలపై ప్రభావం
ఇకపోతే, ప్రభుత్వ డేటా ప్రకారం, ఢిల్లీలోని 750 మురికివాడల్లో 30 లక్షల మంది పైగా ప్రజలు నివసిస్తున్నారు. వారిలో సగం మందికి ఓటు హక్కు ఉంది. 20 అసెంబ్లీ స్థానాలపై ఆ ప్రాంత ప్రజలు గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 61 శాతం మంది మురికివాడల ప్రజలు ఆప్‌కు ఓటు వేశారు. దీంతో, ఆ టైంలో 62 సీట్లు గెలుచుకుంది. 70 అసెంబ్లీ స్థానాలున్న ఢిల్లీలో ఫిబ్రవరి 5న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.






