కొంపముంచిన రూ.10 లక్షల లంచం.. బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-21 12:23:56  IST  )

కర్ణాటక రాజకీయాల్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే చంద్రూలామానీ అరెస్ట్ అయ్యారు.

కొంపముంచిన రూ.10 లక్షల లంచం.. బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక రాజకీయాల్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే చంద్రూలమానీ(MLA Chandru Lamani) అరెస్ట్ అయ్యారు. రూ.10 లక్షలు లంచం తీసుకున్న కేసులో ఆయన్ను శనివారం కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మె్ల్యేతో పాటు ఆయన ఇద్దరు పీఏలను కూడా అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. మైనర్ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన రోడ్డు పక్కన రిటెయినింగ్ వాల్ (రక్షణ గోడ) నిర్మాణ పనుల కేటాయింపు కోసం క్లాస్-1 కాంట్రాక్టర్ విజయ్ పూజార్ నుంచి ఎమ్మెల్యే చంద్రూలమానీ మొత్తం రూ. 10 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందులో భాగంగా శనివారం లక్ష్మేశ్వర పట్టణంలో మొదటి విడతగా రూ. 5 లక్షలు లంచం తీసుకుంటుండగా, ధార్వాడ్ లోకాయుక్తా ఎస్పీ సిద్ధలింగప్ప నేతృత్వంలోని బృందం పక్కా వ్యూహంతో దాడి చేసి ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకుంది.

అనుచరుల అరెస్ట్ – ఆసుపత్రిలో సోదాలు

ఎమ్మెల్యేతో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు (PA) మంజునాథ్ వాల్మీకి, ప్రైవేట్ సహాయకుడు గురు లమానీలను కూడా అధికారులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ ఆపరేషన్ అనంతరం లక్ష్మేశ్వరలోని ఎమ్మెల్యేకు చెందిన ‘బాలాజీ ఆసుపత్రి’లో కూడా లోకాయుక్తా బృందం సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది.

2023 నాటి ఘటన పునరావృతం

గతంలో 2023లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే మాదాల్ విరూపాక్షప్ప కుమారుడు రూ. 40 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఘటన కర్ణాటకలో పెను సంచలనం సృష్టించింది. అప్పట్లో విరూపాక్షప్ప నివాసాల్లో దాదాపు రూ. 8.23 కోట్ల నగదు లభించింది. ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో అధికార పక్షానికి చెందిన మరో ఎమ్మెల్యే పట్టుబడటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం చంద్రూలామానీపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన అధికారులు, ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి పాత్ర ఉందనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు.

Next Story