- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మమతపై బీజేపీ 'డబుల్ అటాక్' స్కెచ్.. 2021 సీన్ రిపీట్ అయ్యేనా?
బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ బిగ్ స్కెచ్ వేసింది. సీఎం మమతా బెనర్జీపై నందిగ్రామ్, భవానీపూర్ స్థానాల్లో సువేందు అధికారిని బరిలోకి దింపింది.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్ (West Bengal Elections) రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ సారి ఎలాగైనా బెంగాల్‍ను కైవసం చేసుకునేందుకు బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా మమతా బెనర్జీ (Mamata Banerjee) టార్గెట్‍గా మరోసారి బిగ్‍స్కెచ్ వేస్తోంది. దీదీపై ఒత్తిడి తీసుకువచ్చేలా 2021 ఎన్నికల్లో జరిగిన సీన్ రిపీట్ చేసేందుకు ప్రణాళికలు వేస్తోంది.ఇందులో భాగంగా సీఎం మమతా బెనర్జీపై బీజేపీ అగ్రనేత సువేందు అధికారిని (Suvendu Adhikari) కమలం పార్టీ బరిలోకి దించబోతోంది. తాజాగా 144 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను సోమవారం బీజేపీ విడుదల చేసింది. ఇందులో సువేందు అధికారి తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నందిగ్రామ్‌తో పాటు మమతా బెనర్జీ ప్రాతినిథ్యం వహిస్తున్న భవానీపూర్ నియోజకవర్గం రెండు చోట్ల పోటీకి దిగబోతున్నారు.
2021 నాటి ప్రతిష్టాత్మక పోరు మళ్ళీ:
అయితే గతంలో టీఎంసీలో మమతా బెనర్జీ నేతృత్వంలో పని చేసిన సువేందు అధికారి ఆపై విభేధించి బీజేపీలో చేరారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీకి కంచుకోటగా ఉన్న నందిగ్రామ్ నియోజకవర్గంలో పోటీ చేసి మమతను ఓడించారు. దీంతో బెంగాల్ లో టీఎంసీ గెలిచినా మమతా బెనర్జీ ఓటమి పాలవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దీదీ.. భవానీపూర్‍లో తన పార్టీ ఎమ్మెల్యే చేత రాజీనామా చేయించి అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతూ వస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో సీన్ మళ్లీ రిపీట్ చేయాలని భావిస్తున్న బీజేపీ ఈ వ్యూహంలో భాగంగా మమతా బెనర్జీ పోటీ చేసే అవకాశం ఉన్న నందిగ్రామ్‍తో పాటు భవానీపూర్‍లో రెండు చోట్ల సువేందు అధికారినే బరిలోకి దింపబోతోంది. మమతా బెనర్జీకి అధికారంతో పాటు ఎమ్మెల్యే పదవిని సైతం దూరం చేయాలనే వ్యూహంలో భాగంగా కమలం పార్టీ ఈ ఎత్తు వేసిందనే టాక్ వినిపిస్తోంది. మరి మమతా బెనర్జీ ఈ రెండు స్థానాల్లోనే పోటీకి ఆసక్తి చూపుతారా లేదా మరెదైనా స్థానం వెతుక్కుంటారా అనేది ఆసక్తిగా మారింది. ఈసారి బెంగాల్ లో మమతా విజయం సాధిస్తే జాతీయ రాజకీయాల్లో మరింత యాక్టివ్ అవుతారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ మమతను ఏ మేరకు అడ్డుకుంటుంది అనేది చూడాలి.






