కేజ్రీవాల్‌కు మరో అద్దాల మేడ.. బీజేపీ షాకింగ్ ఆరోపణలు!

by Phanindra |

కేజ్రీవాల్‌కు పంజాబ్‌లో మరో అద్దాల మేడ నిర్మించారని బీజేపీ షాకింగ్ ఆరోపణలు చేసింది. అయితే ఇవన్నీ పచ్చి అబద్ధాలని ఆప్ కొట్టిపారేసింది.

కేజ్రీవాల్‌కు మరో అద్దాల మేడ.. బీజేపీ షాకింగ్ ఆరోపణలు!
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశరాజకీయాల్లో మరోసారి ‘శీష్ మహల్’ (అద్దాలమేడ) కాంట్రవర్సీ దుమారం రేపుతోంది. గతంలో ఢిల్లీ రాజకీయాలను ఈ వివాదం తీవ్రంగా ప్రభావితం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై బీజేపీ ఇవే ఆరోపణలు చేస్తోంది. పంజాబ్ రాజధాని చండీగఢ్‌లో ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు 7-స్టార్ బంగళా కేటాయించారని బీజేపీ ఆరోపించింది. ఈ భవనానికి సంబంధించిన ఏరియల్ ఫొటోలను షేర్ చేసిన బీజేపీ.. చండీగఢ్‌లోని సెక్టార్-2లో రెండెకరాల స్థలంలో ఈ భవనం నిర్మించారని, సీఎం కోటా కింద దీన్ని శాంక్షన్ చేశారని తెలిపింది. ‘సామాన్యుడిలా నటించే వ్యక్తి మరో భారీ అద్దాలమేడ కట్టుకున్నారు. ఢిల్లీలో శీష్‌ మహల్ ఖాళీ చేయడంతో.. పంజాబ్ సూపర్ చీఫ్ మినిస్టర్‌ కేజ్రీవాల్‌కు అంతకన్నా పెద్ద భవనం నిర్మించుకున్నారు’ అని బీజేపీ పేర్కొంది.

అన్నీ అబద్ధాలే.. ఆప్ కౌంటర్

అయితే ఈ ఆరోపణలన్నింటినీ పంజాబ్‌ను పాలిస్తున్న ఆప్ సర్కారు ఖండించింది. బీజేపీ చెప్పేవన్నీ అవాస్తవాలేనని మండిపడ్డ ఆప్.. ఈ భవనాన్ని కేజ్రీవాల్‌కు కేటాయించినట్లు ఏదైనా లేఖ ఉందా? అని నిలదీసింది. యమునా నదిని శుభ్రం చేస్తామనడం, నకిలీ కాలుష్యం లెక్కలు చూపించడం, ఫేక్ క్లౌడ్ సీడింగ్.. ఇలా బీజేపీ చెప్పిన అబద్ధాలన్నీ బట్టబయలవడంతో ఆ నా పార్టీ ఆందోళనలో ఉందని, అందుకే ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తోందని విమర్శించింది. బీజేపీ చూపిస్తున్న ఫొటో సీఎం క్యాంప్ ఆఫీస్ భవనమని తెలిపింది.

Next Story