- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Trump: వారి కోసమే జన్మత: పౌరసత్వ హక్కు.. ప్రపంచమంతా చొరబడేందుకు కాదు- ట్రంప్
‘జన్మత: పౌరసత్వ హక్కు బానిస పిల్లల కోసం.. ప్రపంచమంతా అమెరికాలో చొరబడటానికి కాదు’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: ‘జన్మత: పౌరసత్వ హక్కు బానిస పిల్లల కోసం.. ప్రపంచమంతా అమెరికాలో చొరబడటానికి కాదు’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత డజన్ల కొద్దీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు. అందులో భాగంగానే జన్మత: పౌరసత్వ హక్కుని రద్దు చేశారు. ఇది వివాదాస్పదం అవ్వడంతో కోర్టు ఆ ఉత్తర్వులను నిలిపివేసింది. ఈక్రమంలోనే ట్రంప్ (Donald Trump) దీనిపైన స్పందించారు. ‘‘ఒకసారి గతాన్ని గుర్తుచేసుకుంటే.. బానిసల పిల్లలకు హక్కులు కల్పించాలనే ప్రాథమిక ఉద్దేశంతో జన్మతః పౌరసత్వాన్ని అప్పట్లో ఆమోదించారు. అంతేగానీ.. ప్రపంచమంతా వచ్చి అమెరికా (USA)లో ఉండేందుకు ఆ చట్టాన్ని తీసుకురాలేదు. చాలామంది మన దేశానికి వస్తున్నారు. అర్హత లేని వ్యక్తులు ఈ చట్టాన్ని వాడుకుంటున్నారు. దీంతో అర్హత లేని పిల్లలకు పౌరసత్వం దక్కుతుంది. చాలా గొప్ప ఉద్దేశంతో బానిసల పిల్లల కోసం తీసుకొచ్చిన చట్టం వృథా అయిపోతుంది’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనిపై అమెరికా సుప్రీంకోర్టుకు వెళ్తానని ట్రంప్ చెప్పుకొచ్చారు. అక్కడ తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని వంద శాతం విశ్వాసంతో ఉన్నట్లు పేర్కొన్నారు.
యూఎస్ సెనేట్ లో బిల్లు
ఈ వారం ప్రారంభంలో రిపబ్లికన్ సెనేటర్ల బృందం యూఎస్ సెనేట్‌లో ఒక బిల్లును ప్రవేశపెట్టింది. ఇది అక్రమ వలసదారుల పిల్లలకు, తాత్కాలిక వీసాలపై వలసదారులు కాని వారి పిల్లలకు జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేస్తుంది. జన్మహక్కు పౌరసత్వంపై ఎటువంటి పరిమితులు లేని ప్రపంచంలోని 33 దేశాలలో అమెరికా ఒకటి అని తెలిపారు. 2023లో అక్రమ వలసదారులకు 2,25,000 నుండి 2,50,000 జననాలు జరిగాయని సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్ అంచనా వేసింది. అందులో దాదాపు ఏడు శాతం జననాలు అమెరికాలోనే జరిగాయి. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజునే జన్మతః పౌరసత్వం లభించే హక్కును రద్దు చేసేలా కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేశారు. దీనిపై డెమోక్రాట్లు అధికారంలో ఉన్న 22 రాష్ట్రాలు 5 దావాలను వేశాయి. అందులో ఒక దానిపై ఇటీవల సియాటిల్‌లోని ఫెడరల్ కోర్టు తీర్పు వెలువరించింది. ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని, దాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది.






