హైవేపై ఏనుగు బీభత్సం.. తృటిలో ప్రాణాలతో బయటపడిన బైకర్

by Ramesh Naini |

కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లాలో ఏనుగుల దాడులు, పంటల నాశనం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి.

హైవేపై ఏనుగు బీభత్సం.. తృటిలో ప్రాణాలతో బయటపడిన బైకర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లాలో ఏనుగుల దాడులు, పంటల నాశనం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి. రాత్రి వేళల్లో ఏనుగుల గుంపులు జాతీయ రహదారులను దాటుతున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కుశాల్‌నగర్‌ సమీపంలోని హోసకోట వద్ద జాతీయ రహదారిపై ఓ ఏనుగు సృష్టించిన బీభత్సం వాహనదారులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. బైకర్‌పైకి ఏనుగు దాడికి యత్నించిన ఓ భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కుశాల్‌నగర్-మడికేరి హైవేపై ఓ బైకర్ అతి వేగంగా ప్రయాణిస్తున్నాడు. అయితే, తన ముందు మార్గమధ్యంలో ఉన్న ఏనుగును అతడు చాలా ఆలస్యంగా గమనించాడు. అప్పటికే ఆ వన్యప్రాణికి అతడు చాలా దగ్గరగా వెళ్లిపోయాడు. బైక్‌ను చూసిన వెంటనే ఏనుగు పెద్దగా ఘీంకరిస్తూ అతని వైపు వేగంగా దూసుకొచ్చింది. ప్రాణభయంతో ఆ యువకుడు తన బైక్‌ను వెనక్కి (U-turn) తిప్పే ప్రయత్నం చేయగా, అది స్కిడ్ అయి కింద పడిపోయాడు. ఏనుగు క్షణాల్లో తనపై దాడి చేస్తుందనగా అప్రమత్తమైన అతడు, బైక్‌ను అక్కడే వదిలేసి వెనక్కి పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నాడు.

కార్ల వైపు కూడా దూసుకొచ్చిన గజరాజు

నిజానికి ఆ బైకర్ వెంట్రుకవాసిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అతడు వెనక్కి పరిగెత్తుకు రావడం చూసిన ఇతర బైకర్లు కూడా వెంటనే అప్రమత్తమై తమ వాహనాలను వెనక్కి తిప్పారు. వారిని కూడా ఆ ఏనుగు వెంబడించడం ప్రారంభించింది. అంతేకాకుండా, రహదారిపై వస్తున్న కార్ల వైపు కూడా దూసుకురావడంతో.. డ్రైవర్లు భయంతో తమ కార్లను వేగంగా రివర్స్ తీసుకుని అక్కడి నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

డాష్‌క్యామ్‌లో రికార్డైన దృశ్యాలు

హోసకోట సమీపంలో హైవేపై నడుచుకుంటూ వెళ్తున్న ఏనుగు వెనుక వస్తున్న ఓ కారు డాష్‌క్యామ్‌లో ఈ భయానక దాడి యత్నం మొత్తం రికార్డ్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ భయానక దృశ్యాలను చూసిన తర్వాత కుశాల్‌నగర్-మడికేరి హైవే గుండా ప్రయాణించాలంటేనే ప్రయాణికులు వణికిపోతున్నారు. రోడ్డుపై ఏ క్షణాన ఏనుగులు దాడి చేస్తాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story