బిహార్‌కు తొలిసారి బీజేపీ సీఎం? నితీశ్‌ను పక్కన పెట్టేస్తారా?

by Phanindra |

బిహార్‌కు తొలిసారి బీజేపీ సీఎం వస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. నితీశ్‌ను పక్కన పెట్టేసి తమ అభ్యర్థిని సీఎం కుర్చీలో కూర్చోపెట్టాలని బీజేపీ చూస్తోంది.

బిహార్‌కు తొలిసారి బీజేపీ సీఎం? నితీశ్‌ను పక్కన పెట్టేస్తారా?
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూసిన బిహార్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. బీజేపీ, జేడీయూ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించింది. ఈ క్రమంలో బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎవరు చేస్తారనే ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ నేతృత్వంలోనే బిహార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ప్రధాని మోడీ, అమిత్ షా పలుమార్లు ప్రకటించినా.. ఎన్డీయే సీఎం అభ్యర్థి ఆయనే అని మాత్రం ఎక్కడా కమిట్ అవ్వలేదు. దానికితోడు ఎన్నికల్లో జేడీయూ కన్నా బీజేపీకే ఎక్కువ సీట్లు కూడా వచ్చాయి. గత ఎన్నికల్లో జేడీయూకు చాలా తక్కువ సీట్లున్నా కూడా.. ఆర్జేడీతో కలిసి జేడీయూ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉండటంతో బీజేపీ తలొగ్గి, నితీశ్‌నే సీఎం చేసింది. అయితే ఇప్పుడు పరిస్థితి అలా లేదు. జేడీయూ మద్దతు లేకున్నా అధికారం ఏర్పాటు చేసే అవకాశం బీజేపీకి దక్కింది. ఒకటీ అరా సీట్లు తగ్గినా.. అమిత్ షా రంగంలోకి దిగితే మద్దతు కూడగట్టడం పెద్ద కష్టమేం కాదు. ఇలాంటి సమయంలోనే బిహార్ సీఎంగా నితీశ్ కొనసాగుతారంటూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టిన జేడీయూ.. కాసేటికే దాన్ని తొలగించడం కూడా ఈ చర్చకు మరింత ఆజ్యం పోసింది.

బీజేపీ సీఎం ఖాయమా?

బిహార్‌లో తొలిసారి సొంత సీఎంను సాధించే అవకాశం బీజేపీకి దక్కింది. ఈ అవకాశాన్ని ఆ పార్టీ వదులుకోవడం జరిగే పని కాదు. ఇప్పటికే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న నితీశ్‌ను సీఎంగా కొనసాగించడంపై ఆ పార్టీ వర్గాల్లో కూడా కొంత చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే నితీశ్‌కు బిహార్ కేబినెట్‌లోకానీ, కేంద్రంలోకానీ కీలక పదవి కట్టబెట్టేసి, రాష్ట్రంలో సీఎంగా తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రేసులో నితీశ్ డిప్యూటీలుగా ఇంతకాలం పనిచేసిన సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా ముందున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ఎవరూ ఊహించని వ్యక్తులను సీఎం చేసిన బీజేపీ.. బిహార్‌లో కూడా అదే స్ట్రాటజీ ఉపయోగించినా ఆశ్చర్యం లేదు.

ముందు నితీశ్‌ అయినా..

ఒకవేళ ముందుగా నితీశ్ కుమార్ చేతనే బిహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించినా.. ఆయన పూర్తి టర్మ్ పూర్తికాకుండానే తప్పుకునే అవకాశం ఉందని కూడా నిపుణులు అంటున్నారు. ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తే.. దాన్ని కారణంగా చూపించి, బీజేపీ తమ అభ్యర్థిని సీఎం చేసే అవకాశం ఉంది. ఆ సమయంలో ఎవరూ బీజేపీకి ఎదురు చెప్పే అవకాశం కూడా ఉండదు. కాబట్టి బిహార్‌కు మొట్టమొదటి బీజేపీ సీఎం రావడం ఖాయమని, అది ఇప్పుడే జరుగుతుందా? కొంత సమయం తర్వాత జరుగుతుందా? అనేదే ప్రశ్న అని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే వయసు మీదపడిన నితీశ్‌ గౌరవంగా తప్పుకొని కొత్తవారికి, విజన్ ఉన్న నాయకుడికి అవకాశం ఇవ్వాలనే వారూ ఉన్నారు.

Next Story