Bihar: బిహార్‌లో పొలిటికల్ ట్విస్ట్.. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ కీలక ప్రకటన

by B.Srinivas |

ఈ ఏడాది చివరలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయా పార్టీలు ప్రచార కార్యక్రమాలు ప్రారంభించాయి.

Bihar: బిహార్‌లో పొలిటికల్ ట్విస్ట్.. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ కీలక ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈ ఏడాది చివరలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయా పార్టీలు ప్రచార కార్యక్రమాలు ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న లోక్ జనశక్తి (రామ్ విలాస్) చీఫ్, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ ( Chirag Paswan) కీలక ప్రకటన చేశారు. బిహార్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని 243 స్థానాల్లోనూ బరిలోకి దిగుతామని తెలిపారు. సరన్ జిల్లాలో ఆదివారం జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. తమ పార్టీ కార్యకర్తకు ఎన్నికల్లో కష్టపడి పని చేయాలని సూచించారు. కాంగ్రెస్, ఆర్జేడీలపై పాశ్వాన్ మండిపడ్డారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించడానికే ఇరు పార్టీలు నిరంతరం ప్రయత్నిస్తు్న్నాయని ఆరోపించారు.

తాను బతికి ఉన్నంత కాలం, వెనుకబడిన కులాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను రద్దు చేయలేరని స్పష్టం చేశారు. బిహార్‌లోనే ఉద్యోగాలు సృష్టించగల ప్రభుత్వం అవసరమని, ప్రజలు తమ సొంత నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పని పొందేలా వీలు కల్పించాలని నొక్కి చెప్పారు. తన రాజకీయ ఎజెండాలో బిహారీ ఫస్ట్ కే ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. కాగా, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పాశ్వాన్ ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. బీజేపీ, జేడీయూలను కాదని ఆయన స్వతంత్రంగా పోటీ చేస్తారా అనే ఊహాగానాలు మొదలయ్యాయి.

Next Story