- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిహార్ అసెంబ్లీలో రసవత్తరంగా ఫ్లోర్ టెస్ట్: సీఎం సామ్రాట్ చౌదరిపై తేజస్వీ యాదవ్ సెటైర్లు
బిహార్ నూతన ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరీ నేతృత్వంలోని ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కొనేందుకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది.

దిశ, వెబ్ డెస్క్: బీహార్ నూతన ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరీ నేతృత్వంలోని ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్ష (Floor Test) ఎదుర్కొనేందుకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. సభ ప్రారంభమైన వెంటనే అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ కొత్త ముఖ్యమంత్రికి అభినందనలు తెలుపుతూనే, నితీష్ కుమార్, బీజేపీ లక్ష్యంగా ఘాటైన విమర్శలు చేశారు.
సభలో చర్చ సందర్భంగా తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నితీష్ కుమారే ముఖ్యమంత్రిగా ఉంటారని జేడీయూ నాయకులు గొప్పగా చెప్పుకునేవారని గుర్తు చేశారు. అయితే.. బీజేపీ నాయకులు నితీష్‌ను ఆ కుర్చీలో ఉండనివ్వరని తాను అప్పుడే చెప్పానని, ఇప్పుడు అదే జరిగిందని ఎద్దేవా చేశారు. "నితీష్ జీ కథ ఇప్పుడు ముగిసింది (Finished). ఒక ఎన్నికైన ముఖ్యమంత్రిని (Elected CM), ఒక ఎంపిక చేయబడిన ముఖ్యమంత్రి (Selected CM) తొలగించారు" అంటూ సామ్రాట్ చౌదరీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అలాగే సామ్రాట్ చౌదరీ 'లాలూ స్కూల్' నుండి వచ్చిన వ్యక్తి కావడం తనకు సంతోషంగా ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
తేజస్వీ వ్యాఖ్యలపై అధికార పక్షం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. దీనిపై ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరీ దీటుగా స్పందించారు. తాను ఏ పాఠశాల నుండి రాలేదని, గతంలో లాలూ యాదవ్ తనను జైలుకు పంపారని గుర్తు చేశారు. అధికారం ఎవరి సొత్తూ కాదని, అందరి ఆశీర్వాదంతోనే తాను ఈ పదవిలో ఉన్నానని స్పష్టం చేశారు. బీజేపీ తనకు ఎంతో గుర్తింపునిచ్చిందని, ప్రస్తుతం ఎన్డీయే (NDA) కూటమి అంతా ఏకతాటిపై ఉందని ఆయన ప్రకటించారు. అనంతరం సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.






