73 ఏళ్ల రికార్డులు బద్దలు కొట్టిన బిహార్‌ పోలింగ్.. కారణం ఏంటి?

by Phanindra |

బిహార్‌లో ఓటింగ్ శాతం 73 ఏళ్ల రికార్డులు బద్దలు కొట్టింది. దీనికి ప్రభుత్వ వ్యతిరేకత కారణమా? లేక ఇంకేదైనా రీజన్ ఉందా?

73 ఏళ్ల రికార్డులు బద్దలు కొట్టిన బిహార్‌ పోలింగ్.. కారణం ఏంటి?
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌ తొలి దశ పోలింగ్ అద్భుతంగా జరిగింది. మొదటి దశలో ఏకంగా 64.66 శాతం పోలింగ్ నమోదవడం గమనార్హం. 73 ఏళ్ల బిహార్ చరిత్రలో ఇంత పోలింగ్ నమోదవడం ఇదే తొలిసారని గణాంకాలు చెప్తున్నాయి. విపక్ష ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, విపక్షాల సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్, తమ కుటుంబాలతో కలిసి పట్నాలో ఓటు వేశారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, బిహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా, కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తదితర ప్రముఖులు కూడా తొలి దశ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బిహార్‌లోని 121 నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఈవీఎంలను లాక్ చేసిన ఎన్నికల అధికారులు.. వాటిని స్ట్రాంగ్ రూమ్స్‌కు తరలించారు.

73 ఏళ్లలో అత్యధికం..

తొలి దశ ఎన్నికల్లో నమోదైన 64.66 శాతం ఓటింగ్ ఇప్పటి వరకు బిహార్ చరిత్రలో నమోదైన అత్యధిక పోలింగ్ కావడం గమనార్హం. అంతకుముందు 2000 సంవత్సరంలో నమోదైన 62.57 శాతమే అత్యధికంగా ఉండేది. లోక్‌సభ ఎన్నికల్లో అయితే 1998లో బిహార్ 64.6 శాతం ఓటింగ్ నమోదు చేసింది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మార్కును ఇంతకుముందు ఎప్పుడూ అందుకోలేదు. ఈసారి ప్రజలు భారీగా తరలివచ్చి ఓట్లు వేయడంపై సీఈసీ జ్ఞానేశ్ కుమార్.. ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

ప్రభుత్వ వ్యతిరేకతా?

ఎప్పుడైనా ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగిందంటే ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉందనేది నిపుణులు చెప్పే మాట. గత మూడు ఎన్నికల్లో బిహార్‌లో ఇలాగే జరిగింది. 2010లో బీజేపీతో కలిసి నితీశ్ కుమార్‌కు చెందిన జేడీయూ గెలిచింది. అప్పుడు ఓటింగ్ 52.73 శాతంగా నమోదైంది. 2015లో ఓటింగ్ శాతం 56.91 శాతానికి పెరిగింది. ఆ టైంలో విపక్ష ఆర్జేడీతో జట్టుకట్టిన జేడీయూ నెగ్గింది. అంటే జేడీయూ-బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చినట్లే కదా. 2020లో మళ్లీ కమలం పార్టీతో జట్టు కట్టిన నితీశ్.. మరోసారి గెలిచారు. ఆ టైంలో 57.29 శాతం ఓటింగ్ జరిగింది. 2020లో తొలి దశ ఓటింగ్ 56.2 శాతమే. కానీ ఈసారి 64.66 శాతం ఓటింగ్ జరిగింది. అంటే ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిందని విశ్లేషకుల అభిప్రాయం. అదే నిజమైతే 2020 ఎన్నికల్లోనే 75 సీట్లు నెగ్గి అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆర్జేడీకి ఈసారి మరిన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది.

ఎస్ఐఆర్ ఎఫెక్టా?

అయితే ఓటింగ్ శాతం పెరగడానికి ఈ రాష్ట్రంలో ఈసీ చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కూడా కారణమేననే వాదన కూడా వినిపిస్తోంది. ఎందుకంటే ఎస్ఐఆర్ తర్వాత రాష్ట్రంలో 47 లక్షల ఓట్లు తొలగించారు. గతంలో 7.89 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య 7.42 కోట్లకు చేరింది. ఈ 47 లక్షల ఓట్లు తగ్గడం వల్లనే ఓటింగ్ శాతం పెరిగి ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఉదాహరణకు గతంలో 100 మంది ఓటర్లున్నారనుకుంటే.. వారిలో 60 మంది ఓటేస్తే పోలింగ్ 60 శాతంగానే ఉంటుంది. ఎస్ఐఆర్ తర్వాత ఓటర్ల సంఖ్య 80కి తగ్గిందనుకుంటే.. అదే 60 మంది ఓటేసినా పోలింగ్ శాతం 75 శాతంగా నమోదవుతుంది. అప్పుడు పోలింగ్ పెరిగినట్లు కాదు కదా?

Next Story