బిహార్‌లో క్యాంపెయిన్ ఫీవర్.. సీనియర్ నేతల ప్రచారంతో హీటెక్కిన క్యాంపెయిన్

by Phanindra |

బిహార్‌లో క్యాంపెయిన్ ఫీవర్ పెరిగింది. సోమవారం నాడు అన్ని పార్టీల్లో సీనియర్ నేతల ప్రచారంతో క్యాంపెయిన్ సీన్ హీటెక్కింది.

బిహార్‌లో క్యాంపెయిన్ ఫీవర్.. సీనియర్ నేతల ప్రచారంతో హీటెక్కిన క్యాంపెయిన్
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌లో తొలి దశ ఎన్నికల ప్రచారం గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ తమ విమర్శనాస్త్రాలకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం నాడు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ తదితరులు బిహార్‌లో భారీ ర్యాలీలు చేపట్టారు. ఈ క్రమంలో ప్రతిఒక్కరూ ప్రత్యర్థి పక్షంపై విమర్శల వర్షం కురిపించారు.

విపక్షాలపై మోడీ విమర్శలు

బిహార్‌లో భారీగా ప్రచారం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ.. సోమవారం నాడు కతిహార్, సహర్సా జిల్లాల్లో భారీ సభల్లో ప్రసంగించారు. విపక్ష కూటమిపై విమర్శల వర్షం కురిపించిన ఆయన.. ఆర్జేడీ బెదిరింపుల వల్లనే తేజస్వీ యాదవ్‌ను సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ ఒప్పుకుందన్నారు. ప్రచారంలో కావాలనే ఆర్జేడీ పోస్టర్లలో పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఫొటోలు ఉంచడం లేదని, ఆయన చేసిన పాపాలు దాచిపెట్టేందుకే ఇలా చేస్తున్నారని విమర్శించారు.

గెలిచేది మేమే: షా

నేపాల్ బోర్డర్ సమీపంలోని సియోహర్, మధుబని, సితామఢీ జిల్లాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభల్లో మాట్లాడారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ఈ ఎన్నికల్లో భారీ విజయం దక్కుతుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. నవంబరు 14న ఫలితాల సమయంలో మధ్యాహ్నం ఒంటిగంటకే ఇండియా కూటమి తుడిచిపెట్టుకుపోయిందని అందరికీ తెలిసొస్తుందంటూ ప్రకటించారు. ఈ సభల తర్వాత జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్, ఇతర నేతలతో కలిసి డిన్నర్ చేశారు.

ఇంకా అవే విమర్శలా.. మీరేం చేశారు?: ఖర్గే

బిహార్ ప్రచారం మొదలైన తర్వాత తొలి ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే.. పట్నాలో ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. నితీశ్ కుమార్‌ను సీఎం చేసే యోచన మోడీకి లేదని, ఈ విషయంలో బీజేపీ-జేడీయూ మధ్య విభేదాలు తలెత్తాయని ఆయన ఆరోపించారు. ఈ కారణంగానే మోడీ పాల్గొన్న ర్యాలీలు, సభల్లో నితీశ్ కనిపించడం లేదన్నారు. నితీశ్‌ను సీఎం చేయకుండా అడ్డుకోవాలనేదే మోడీ ప్లాన్ అన్నారు. అలాగే పీఎంగా మోడీ 11 ఏళ్లు, బిహార్ సీఎంగా నితీశ్ 20 ఏళ్లు ఉన్నారని.. అయినా సరే జంగిల్ రాజ్ గురించి మాట్లాడతారే కానీ, తాము ఏం చేశామో వాళ్లు చెప్పలేకపోతున్నారని విమర్శించారు. విద్య, వైద్యం, కనీస మద్దతు ధర, పెట్టుబడులు, ఉద్యోగాలు.. వంటి విషయాల గురించి వాళ్లు ఏం మాట్లాడలేకపోతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. ఇక కాంగ్రెస్ తలపై తుపాకీ పెట్టారంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలను కూడా ఖర్గే ఖండించారు. పీఎం అయ్యుండి ఇలా మాట్లాడమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను ఎవరూ బెదిరించలేరని, తమ కూటమి పరస్పర గౌరవంతో ముందుకెళ్తోందని స్పష్టంచేశారు.

Next Story